గెలుపు మనదే.. పండగ చేస్కోండి... కానీ.... జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మనం విజయం సాధించబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష పీఠానికి మంగళవారం ఎన్నికలు జరుగగా, బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పేలా లేదు. అయితే, వీరిద్దరి మధ్య పోటీ మాత్రం తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది. ప్రస్తుతం జో బైడెన్‌కు 224 ఎలక్టోరల్ ఓట్లు లభించగా, ట్రంప్‌కు 212 ఓట్లు వచ్చాయి.
మొత్తంమీద ఈ అధ్యక్ష రేసు తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో జో బైడెన్ కాసేపటి క్రితం దేశ ప్రజలను ఉద్దేశించి దిలావేర్ నుంచి ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ట్రాక్‌లో ఉన్నామన్నారు.
ఇలా రసవత్తర పోటీ ఉంటుందని మాకు ముందే తెలుసు అని, కానీ వచ్చిన ఫలితాల పట్ల మేం సంతోషంగా ఫీలవుతున్నామని, ఇది నిజంగా అద్భుతమని బైడెన్ కొనియాడారు. ఎన్నికల్లో విజయం సాధించే బాటలో ఉన్నామన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చేందుకు దేశం యావత్తు చివరి ఓటును లెక్కించే వరకు వేచి ఉండాలన్నారు.
మద్దతుదారులంతా సంయమనంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. తుది ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆరిజోనాలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మిచిగన్, విస్కిన్‌సన్ ఫలితాల పట్ల కూడా సంతోషంగా ఉందన్నారు. జార్జియా ఈసారి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం బైడెన్ 224, ట్రంప్ 212 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. మరికాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్ కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు.