1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (15:26 IST)

దేశ ఉనికికి ముప్పు ఏర్పడితే అణు బాంబు తయారు చేస్తాం : ఇరాన్

iran protest
తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లితే మాత్రం అణు బాంబు తయారీకి కూడా ఏమాత్రం వెనుకంజ వేయబోమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖర్రాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ దేశంతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అణుబాంబు తయారు చేయాలనే నిర్ణయం తీసుకోలేదని, అయితే ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే వేరే మార్గం ఉండబోదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ముప్పు ఉందని పసిగడితే పరిస్థితులకు అనుగుణంగా ఇరాన్ అణు సిద్ధాంతం, సైనిక సిద్ధాంతాలు మారతాయని అన్నారు. 
 
బయటి దేశాలు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుంచి తమపై ఒత్తిడి పెరిగితే అణ్వాయుధాల అభివృద్ధిని తిరిగి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. ఇజ్రాయెల్ తమ అణు కేంద్రాలపై దాడి చేస్తే తమ ఆలోచన మారుతుందని ఖర్రాజీ హెచ్చరించారు. కాగా ఇరాన్‌‍తో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రతినిధుల చర్చలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తున్నట్టుగా 2021లో ఇరాన్ ఫత్వా జారీ చేసింది. 
 
అయితే అణు కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఈఏ షరతులను ఇరాన్ పూర్తిగా పాటించలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఏప్రిల్ నెలలో సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై బాంబు దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ చెబుతోంది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, మిసైల్స్ కూడా ప్రయోగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.