యుద్ధం నుంచి పారిపోతారా.. తలలు తెగనరకండి.. సొంత సభ్యులను పీకలు కోసిన ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదులు ఎంతటి దారుణానికైనా పాల్పడతారని మరోమారు నిరూపించారు. సొంత సభ్యులన్న కనికరం కూడా లేకుండా 20 మంది సభ్యుల తలలను తెగనరికిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
తమ పిలుపునకు ఆకర్షితులై యుద్ధ రంగంలోకి దిగి, ఆ తర్వాత వారి అసలు నైజం తెలుసుకుని వారికి దూరంగా జరుగుతున్న మిలిటెంట్లను కూడా ఐఎస్ ఉగ్రవాదులు వదిలిపెట్టడం లేదు. ఇటీవల పరిణామాలతో భయాందోళనకు గురైన 20 మందికి పైగా ఐఎస్ మిలిటెంట్లు యుద్ధ రంగం నుంచి తప్పుకోవాలని భావించారు.
ఇరాక్ పట్టణం మోసుల్ నుంచి తప్పించుకుని వెళుతున్న సదరు మిలిటెంట్లను ఐఎస్ ఉగ్రవాదులు పట్టణ చెక్ పోస్టుల వద్ద శుక్రవారం రాత్రి పట్టేశారు. యుద్ధం నుంచి వెళ్లిపోవడం తప్పేనని వారిని షరియా కోర్టు ముందు హాజరుపరిచారు. షరియా కోర్టు కూడా వారి పలాయనాన్ని తప్పుగానే తేల్చింది. మరణ శిక్ష విధించింది. దీంతో ఆ 20 మంది మిలిటెంట్ల తలలను బహిరంగంగా నరికేసిన ఐఎస్ ఉగ్రవాదులు సదరు వీడియోలను కూడా తమ అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశారు.