శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (14:36 IST)

మరో కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్ : ఆంక్షలు ఎత్తివేత!

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానపరంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బైడెన్ సర్కారు సమీక్షించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో వలసదారులు దేశంలో ప్రవేశించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తొలగించారు. 
 
నాటి నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకుంటున్నట్టు బైడెన్ తాజాగా ప్రకటించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. గతేడాది వీసాలు పొందిన, పొందాలనుకునేవారికి మునుపటి నిర్ణయాలు ప్రతికూలంగా మారాయని... ఈ నిర్ణయాలు వలసదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రతిబంధకమని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను అమెరికా సంస్థలు కోల్పోతాయని అన్నారు. అటు, అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అటార్నీ కర్టిస్ మారిసన్ అధ్యక్షుడి తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. బైడెన్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
 
ప్రతిభావంతులైన ఉద్యోగులను రప్పించేందుకు అమెరికాగతంలో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమం చేపట్టింది. అయితే ట్రంప్ నిర్ణయం ఈ కార్యక్రమ స్ఫూర్తిని దెబ్బతీసిందని బైడెన్ ప్రభుత్వ వర్గాలు భావించాయి. 
 
కాగా, ఇటీవలే బైడెన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసింది. దీంతో అనేక మంది భారతీయ టెక్కీలు లబ్ది పొందనున్నారు.