బైడెన్ సర్కారు మరో కీలక నిర్ణయం : పౌరసత్వ పరీక్ష రద్దు..

joe biden
ఠాగూర్| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:09 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గత యేడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసింది. అర్హులైన అభ్యర్థులందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ఆయన సర్కార్ ప్రకటించింది.

అమెరికా పౌరులు కావాలనుకునే వారు ఇంగ్లీష్ అర్థం చేసుకుని, సివిక్స్ పరీక్షలో పాస్ అయితే చాలన్న పాత నిబంధనలనే మళ్లీ తీసుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) దీనిపై ప్రకటన జారీ చేసింది.

కాగా, గత యేడాది డిసెంబరులో అప్పటి ప్రధాని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల పౌరసత్వం ఇచ్చే ప్రక్రియలో సహజత్వం దెబ్బతింటుందని, దీంతో దానిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

అయితే, ఇప్పటిదాకా కొత్త పద్ధతిలో పరీక్షకు సన్నద్ధమవుతున్న వారి కోసం ఏప్రిల్ 19 దాకా ‘ట్రంప్’ రూల్ ప్రకారమే పరీక్ష రాయొచ్చని, 2021 మార్చి 1 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 2008 పద్ధతి ప్రకారం పరీక్ష రాయొచ్చని యూఎస్ సీఐఎస్ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఎక్కువగా భారతీయులే లబ్ది పొందే అవకాశం వుంది.దీనిపై మరింత చదవండి :