బేబీ పౌడర్‌లో కేన్సర్ కారక యాస్బెస్టాస్ .. సమన్లు జారీ
బేబీ పౌడర్ తయారీలో కేన్సర్ కారక యాస్బెస్టాస్ కలుపుతున్నారనే ఆరోపణలపై దాఖలైన కేసులో అమెరికా న్యాయశాఖకు, సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌కు (ఎస్ఈసీ) సమన్లు జారీ చేసినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ బుధవారం తెలిపింది. ఈ కేసు విచారణలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు.
బుధవారం తన వార్షిక నివేదికను ప్రకటిస్తూ జాన్సన్ అండ్ జాన్సన్, బేబీ పౌడర్ ఉత్పత్తులపై ఫెడరల్ ఏజెన్సీల నుంచి సమన్లు అందుకున్నట్టు మొట్టమొదటిసారి బహిర్గతం చేసింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు న్యాయ శాఖ, ఎస్ఈసీ నిరాకరించాయి.
కాగా, ఈనెల 14వ తేదీన ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ వార్తకథనంలో జాన్సన్ అండ్ జాన్సన్ కొన్ని దశాబ్దాలుగా తన బేబీ పౌడర్, పౌడర్ ఉత్పత్తుల్లో తక్కువ పరిమాణంలో కార్సినోజెన్ అనే యాస్బెస్టాస్‌ను కలుపుతోందని ఓ కథనంలో పేర్కొంది.
1970ల నుంచి 2000ల ఆరంభం వరకు నిర్వహించిన అనేక పరీక్షల్లో కార్సినోజెన్ ఛాయలు బయటపడినట్టు పేర్కొంది. ఈ విషయం తెలిసినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ ఎప్పుడూ దీని గురించి రెగ్యులేటర్స్‌కి కానీ, ప్రజలకు కానీ చెప్పలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన షేర్లను భారీగా విక్రయించింది. ఫలితంగా కంపెనీ కేవలం ఒక్కరోజులో సుమారుగా 40 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ వాల్యూ నష్టపోయింది. ఈ ఆరోపణలపై ఓ కేసు నమోదు కాగా, ఈ కేసులో సమన్లు జారీ అయ్యాయి.