కువైట్ అగ్నిప్రమాదం... గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన శవాలు...
కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో కార్మికుల శవాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో శవాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వారి బంధువులకు అప్పగించాలని భారత విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. కువైట్‌లోని మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 42 మంది భారతీయ కార్మికులు సజీవ దహనమైన విషయం తెల్సిందే. మంగాఫ్‌లో ఉన్న అల్-మంగాఫ్ అనే ఆరు అంతస్తుల భవనాన్ని ఎన్‌బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 24 మంది కేరళ వాసులు, ఐదుగురు తమిళులు ఉన్నారు.
అయితే ఈ అగ్నిప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దాంతో వాటి గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. 'మృతులను గుర్తించిన వెంటనే.. వారి బంధువులకు సమాచారం అందిస్తాం. మన వాయుసేన విమానం ఆ మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తుంది' అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండటంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొంది.
కాగా, ఈ ఘటనపై విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్.. కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్నిప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు. అలాగే గాయపడినవారికి వైద్యసహాయం అందుతోందని చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంపై కువైట్ మంత్రి మాట్లాడుతూ.. కంపెనీ, భవన యజమానుల అత్యాశవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ఆ భవనాన్ని ఎన్‌బీటీసీ సంస్థ అద్దెకు తీసుకుంది. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండానే అక్కడ కార్మికులను ఉంచింది. ఫలితంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 21 మంది కేరళ, ఐదుగురు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు.