శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (07:19 IST)

రాణి అయితేనేం.. బొకే ఇవ్వాలని రూల్ ఉందేం?

ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలిన మహారాణి అయినాసరే లైన్లో నిలబడి పూల బొకే ఇవ్వాలా.. అలా రూలుందా అన్నట్లుగా బొకే ఇవ్వడానికి మొరాయించిన బుడతను చూసి అంతటి మహారాణే డంగైపోయి తేరుకుని చక్కగా నవ్వుకుంటూ వెళ్లారట.

దేశానికి రాజయినా తల్లికి మాత్రం కొడుకునే కదా అన్నారు మాజీ ప్రధాని పీవి నరసింహారావు గతంలో ఒక సందర్భంలో.. అలాంటిది ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలిన మహారాణి అయినాసరే లైన్లో  నిలబడి పూల బొకే 
ఇవ్వాలా.. అలా రూలుందా అన్నట్లుగా బొకే ఇవ్వడానికి మొరాయించిన బుడతను చూసి అంతటి మహారాణే డంగైపోయి తేరుకుని చక్కగా నవ్వుకుంటూ వెళ్లారట.. ఆమె ఎవరో కాదు. బ్రిటన్ మహారాణి. 
 
వివరాల్లోకి వెళితే.. క్వీన్‌ ఎలిజబెత్‌... ఈమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ రకంగా ఆమె బ్రిటన్‌కే కాదు.. ప్రపంచానికే రాణి. ఎందుకంటే ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు ఒకప్పుడు బ్రిటన్‌ పాలనలోనే ఉండేవి. అలాంటి రాణికి బొకే ఇచ్చే అవకాశమే వస్తే... నిజానికి రాదనుకోండి.. ఒకవేళ వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదూ!

కానీ అల్ఫీ లన్‌ మాత్రం.. అందుకు ససేమిరా అన్నాడు. ఎందుకు.. అనే కదా మీరు అడుగుతోంది. నిజానికి తాను బొకే ఎందుకు ఇవ్వనన్నాడో బహుశా అల్ఫీకి కూడా తెలియదనుకుంటా. విషయం ఏమిటంటే. 
 
అల్ఫీ లన్‌ అనే రెండేళ్ల బుడతకి బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌కు బొకే ఇచ్చే అవకాశం వచ్చింది. రాణి వచ్చే సమయానికి పిల్లాణ్ని ఎత్తుకొని తల్లి సిద్ధంగా ఉంది. రాణి రావడంతోనే బొకే ఇవ్వాలని కూడా చెప్పింది. ముందు బాగానే తల ఊపిన అల్ఫీ.. తీరా రాణి దగ్గరకు వచ్చేసరికి ఏడుపు లంఘించుకున్నాడు.

అంతటితో ఆగాడా... తల్లి చేతుల్లో నుంచి కిందకు దిగి బొకే ఇవ్వనంటూ మారం చేశాడు. తల్లి ఎంతగా బతిమాలినా ససేమిరా అన్నాడు. దీంతో తల్లి బలవంతంగా చేయి పట్టుకొని బొకే ఇప్పించింది. దీంతో క్వీన్‌ ఎలిజబెత్‌ నవ్వుకుంటూనే బొకే తీసుకొని అక్కడి ఉంచి వెళ్లిపోయింది. తీరా ఆమె వెళ్లాక మళ్లీ ముసిముసి నవ్వులు నవ్వాడు.