బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (12:04 IST)

పాకిస్థాన్‌లో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులు... తాజా దాడుల్లో 70 మంది మృతి

terrorists
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఉగ్రవాదులు అరాచకానికి పాల్పడుతున్నారు. తమ జాతి కానివారిని గుర్తించి మరీ చంపేస్తున్నారు. గత రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో ఏకంగా 70 మందిని చంపేశారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ సైనికులు వెల్లడించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని లాస్బెలా జిల్లాలోని బేలా పట్టణంలోని ఒక జాతీయ రహదారిపై వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 14 మంది సైనికులు, పోలీసులు చనిపోయారు. అలాగే 21 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారని అల్ జజీరా పేర్కొంది.
 
ముసాఖేల్ జిల్లాలో ఉగ్రవాదులు ఐడీ కార్డులను పరిశీలించి మరీ పౌరులపై దాడులకు పాల్పడ్డారు. పంజాబ్‌కు చెందినవారని నిర్ధారించుకుని దాడి చేశారు. అలా 23 మంది పౌరులను చంపేశారు. ఈ దాడిలో 35 వాహనాలను కూడా తగలబెట్టారు. కలాత్లో పోలీస్ పోస్టు, హైవేపై జరిగిన దాడిలో ఐదుగురు పోలీసులు, ఐదుగురు సామాన్య పౌరులు మృతిచెందారు. ఇక బోలాన్ పట్టణంలోని రైల్వే వంతెనపై ఉగ్రవాదులు దాడి జరపగా, సమీప ప్రాంతాల్లో ఆరుగురు చనిపోయినట్లు రైల్వే అధికారి ముహ్మద్ కాషిఫ్ వెల్లడించారు.
 
ప్రధానంగా పంజాబ్ ప్రావిన్స్‌ను అనుసంధానించే హైవే వెంబడి ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రావిన్స్‌లోని ప్రజలు హైవేలకు దూరంగా ఉండాలని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్) హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. సామాన్యులుగా ప్రయాణిస్తున్న సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దాడులు జరిపాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, చనిపోయినవారు సామాన్య ప్రజలేనని తెలిపింది.
 
మరోవైపు, ముసాబైల్ దాడిని పాక్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ, అంతర్గతశాఖ మంత్రి మొహ్సీన్ నఖ్వీ అనాగరిక చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. అటు బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుక్తీ కూడా ఉగ్రదాడులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అక్కడి మీడియా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో 12 మంది ఉగ్రవాదులను సైన్యం, పోలీసులు మట్టుబెట్టినట్లు సమాచారం.