కరోనా సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో.. అలా వుండండి..
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలపాటు లాక్‌డౌన్ విధిస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో దేశ ప్రజలనుద్ధేశిస్తూ ప్రధాని జసిండా వ్యాఖ్యానించారు. ఒకవేళ మీకు కరోనా వైరస్ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని పిలుపునిచ్చారు.
న్యూజిలాండ్‌లో ఒకేసారి 50కొవిడ్-19 కేసులు నమోదుకావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 205కు చేరింది. దీంతో వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం నెలపాటు లాక్‌డౌన్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొవిడ్-19తో ఒక మరణం సంభవించకపోయినా ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
లాక్‌డౌన్ విధించిన ఈ నెలరోజుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ సమయంలో ప్రతివ్యక్తి స్వతహాగా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.