శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (15:00 IST)

అమెరికాలో నవశకం... కరోనా ఉద్దీపన ప్యాకేజీ!

అమెరికాలో నవశకం మొదలైంది. కరోనా వైరస్ దెబ్బకు అమెరికా తల్లడిల్లిపోతోంది. గంటల వ్యవధిలో వందల వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అమెరికన్లు కొట్టుమిట్టాడున్నారు. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో ఈ వైరస్ మహమ్మారి మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. 
 
ఈ వైరస్ భూతం నుంచి ప్రజలను కాపాడేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. భారత్‌లో కూడా మంగళవారం అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రి వరకు ఈ సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోవుండనుంది. ఈ మేరకు భారత్‌లో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కోరల నుంచి అమెరికాను రక్షించేందుకు కూడా ఇలాంటి లాక్‌డౌన్ ప్రకటిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, దేశంలో లాక్‌డౌన్ ప్రకటించే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విస్పష్టంగా తేల్చి చెప్పారు. అదేసమయంలో ట్రంప్ ప్ర‌భుత్వం భారీ ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించింది. ఈ ప్యాకేజీ విలువ దాదాపుగా 2 ట్రిలియన్ డాలర్లు. 
 
ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు అమెరికా సేనేట‌ర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీక‌రించింది. వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డ‌బ్బులు బదిలీ చేస్తారు. క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న వ్యాపార‌వ‌ర్గాల‌కు కూడా ఈ ప్యాకేజీ డ‌బ్బు వెళ్తుంది. 
 
త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఆధునిక‌ అమెరికా చ‌రిత్ర‌లో ఇది అతిపెద్ద ఉద్దీప‌న ప్యాకేజీ అని నిపుణులు అంటున్నారు. ప్ర‌తి ఒక వ్య‌క్తికి ప్యాకేజీ కింద 1200 డాల‌ర్లు ఇస్తారు. ప్ర‌తి ఒక చిన్నారికి 500 డాల‌ర్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం జ‌రిగింది. అమెరికాలో జీవిస్తున్న దాదాపు ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు కూడా ఈ సొమ్మును అందజేస్తారు.