శాంతి బహుమతికి అభ్యర్థులు చేసిన పనులే గీటురాయి... వైట్‌హౌస్‌కు నోబెల్ కమిటీ చురకలు
ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశాలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ కమిటీ ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ ప్రకటనతో డోనాల్డ్ ట్రంప్ నిర్ఘాంత పోయారు.
నిజం చెప్పాలంటే ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తందని ట్రంప్ కలలుగన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్‌కు శాంతి బహుమతి వచ్చినట్లు 'మిస్టర్ పీస్ ప్రెసిడెంట్' అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌస్.. నోబెల్ కమిటీపై విమర్శలు చేసింది. బహుమతి ప్రకటనను రాజకీయం చేశారని ఆరోపించింది. ఈ విమర్శలపై నోబెల్ కమిటీ తాజాగా స్పందించింది.
'నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్నిరకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం. నోబెల్ ప్రైజ్‌కు ఎంపికలో ప్రధానంగా 'అభ్యర్థి చేసిన పనుల'ను పరిగణనలోకి తీసుకుని, ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్‌కు కౌంటరిచ్చింది.
నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపికలోనూ ఈ నియమాలనే పాటించామని స్పష్టం చేసింది. ఏటా నోబెల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాదిగా దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారినే బహుమతి కోసం ఎంపిక చేస్తామని, ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.