శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (13:08 IST)

ప్రపంచానికి ఇటలీ నేర్పిన గుణపాఠం.. ఓ ఇటలీ పౌరుడి ఆవేదన

ప్రపంచానికి ఇటలీ నేర్పుతున్న గుణపాఠం. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొండి. ఇది ఓ ఇటలీ పౌరుడు ఇతర ప్రపంచ దేశాలకు రాసిన ఓ లేఖ.

మాది అందమైన దేశం. ప్రశాంతమైన జీవితం. సుఖ సంతోషాలతో ప్రజలు. మా దేశం ఇటలీ. మానగరం మిలాన్. నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. అదేమంటే మా నగరంలో జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉంది. ఎందుకు ఈ విధంగా దుర్బరంగా మారిపోయింది. 
 
ప్రపంచంలోనే అందమైనదిగా పేరొందిన మానగరం ఎందుకిలా అయింది. మీరంతా మేము చేసిన పొరపాట్ల నుండి నేర్చుకొని మాలాగా మీ జీవితాలను, మీ దేశాన్ని చీకట్లోకి నెట్టి వేయరని, నెట్టి వేయకుండా ఉంటారని మీకు ఈ విషయం చెబుతున్నాను.
 
ఇప్పుడు మేమంతా ఉన్నది క్వారంటైన్‌లో. వీధుల్లోకి వెళ్ళలేము. పొరపాటున వెళితే వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తారు. అన్ని మూతపడ్డాయి. షాపులు ఆఫీసులు వీధులు అన్ని మూతపడ్డాయి. 
 
మాకు అనిపిస్తుంది ఇదే యుగాంతం ఏమో అని. మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం. మేము అనుకోలేదు ఇలా ఈనాడు గాఢాంధకారంలోకి నెట్టి వేయబడుతుంది మా దేశం అని. దీనికంతటికి కారణం ఒకటే ఇటాలియన్స్ అయిన మేము చేసిన ఓ చిన్నతప్పు.

మా దేశం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం మేమే. ఒక్క క్షణం మేము గత వారం మా ప్రభుత్వం అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఈనాడు మా దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కరోనా వైరస్ వ్యాపిస్తుంది అని బయటకు వెళ్ళవద్దని మా ప్రభుత్వం సెలవులు ఇస్తే మేం ఏం చేసాం?

విహారయాత్రలకు వెళ్లాం. సినిమాకి వెళ్ళాం. చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం. బజారులో కూర్చుని గుంపులుగుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నాం. అందరం కూడా ప్రభుత్వం చేసిన సూచనను చాలా తేలికగా తీసుకున్నాం. ఆనాడు మాకు తెలియదు.

ఆ క్షణం చేసినటువంటి ఆ చిన్న తప్పు ఈనాడు మా దేశాన్ని, మా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని. రోజుకు రెండు వందల మంది చనిపోతున్నారు. ఇది మా దేశంలో మందులు లేక కాదు. వైద్యులు లేక కాదు. కేవలం అంతమంది వ్యాధిగ్రస్తులను ఉంచడానికి సరిపోయేంత స్థలం లేక. ఇదంతా దేశ పౌరులుగా చేసిన తప్పు వల్లే. 
 
ప్రభుత్వం చెప్పిన మాట వినకపోవడం వల్లే. అవును మేము తప్పు చేశాం. ప్రపంచ ప్రజలారా మేల్కొండి. మా పరిస్థితి మీకు రావద్దని మా ఆశ ఆకాంక్ష. తక్షణమే మీ ప్రభుత్వం మీ అధికారులు చేసినటువంటి సూచనలు పాటించండి. పండుగలు జాతరలు పెళ్లిళ్లు పేరంటాలు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడైనా చేసుకోవచ్చు . వినండి అందమైన అభివృద్ధి చెందిన ఒక చిన్న దేశంగా మొదలెట్టిన మా ప్రయాణం ఈనాడు ఎలా ఉందో మీరంతా చూస్తూనే ఉన్నారు.

మీకు మా పరిస్థితి రావొద్దు... మీరు మారతారని ఆశిస్తూ....
మీ మిత్ర దేశ పౌరుడు.
ఓ ఇటాలియన్.