1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

Khawaja Asif
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఈ సైనిక దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‍లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళాలు ఈ వరుస దాడులు చేస్తూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. 
 
పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపించడంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. న్యూఢిల్లీ శాంతించినట్టయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బుధవారం వెల్లడించారు. 
 
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం సైనిక దాడి చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తేనే తాము తిరిగి దాడులు చేస్తామని ఆసిఫ్ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ నివేదించింది. కాగా, నిన్నామొన్నటివరకు భారత్ దాడిచేస్తే ప్రతీకార దాడి తప్పదంటూ ప్రగల్భాలు పలికిన ఖావాజా ఆసిఫ్.. ఒక్క రోజు రాత్రి జరిగిన వరుస దాడులతోనే వణికిపోయి, శాంతిమంత్రం జపిస్తున్నారు.