పాకిస్థాన్ మంత్రివర్గంలో కాశ్మీర్ ఉగ్రవాది భార్యకు చోటు - కేబినెట్ హోదా!
పాకిస్థాన్ మంత్రివర్గంలో కాశ్మీర్ ఉగ్రవాది భార్యకు చోటు కల్పించారు. ఆమెకు ఏకంగా కేబినెట్ హోదాను ఇచ్చారు. ఈమె కాశ్మీర్‌లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాది యాసిన్ మాలిక్ భార్య కావడం విశేషం. పేరు ముషాల్ హుస్సేన్ ముల్లిక్. పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని సలహాదారురాలిగా ఆమెను నియమించి, ఏకంగా జూనియర్ మినిస్టర్ హోదాను కట్టబెట్టారు. దీంతో టెర్రరిస్టు భార్య ముల్లిక్.. పాకిస్థాన్‌లో మానవ హక్కులు, మహిళా సాధికారత తదితర అంశాల్లో పాక్ దేశ ప్రధానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
పాకిస్థాన్ దేశంలో ప్రభుత్వం అన్వర్ ఉల్ హక్ కాకర్ సారథ్యంలో ఆపద్ధర్మ ప్రబుత్వం ఏర్పాటైంది. ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఇటీవల పాకిస్థాన్ పార్లమెంటును రద్దు చేయడంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. 90 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అప్పటివరకు ముల్లిక్ పాక్ కేబినెట్ హోదాలో కొనసాగుతారు.
మరోవైపు, ఉగ్రవాదులకు నిధుల సమీకరణ కేసులో యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ, ఎన్.ఐ.ఏ మాత్రం మరణశిక్ష విధించాలంటూ వాదిస్తుంది. ఈ కేసులో ఈ నెల 9వ తేదీన వీడియో లింక్ ద్వారా యాసిన్ మాలిక్ కోర్టు విచారణకు హాజరయ్యారు. టెర్రిరిస్ట్ అయిన మాలిక్.. గత 2009లో ముల్లిక్‌ను వివాహం చేసుకున్నారు.