రుతుక్రమం ప్రారంభమైతేనే బాలిక వివాహం చెల్లుతుంది.. సింధు హైకోర్టు
పాకిస్థాన్‌లోని సింధ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రుతుక్రమం ప్రారంభమైంది కాబట్టి బాలిక వివాహం చెల్లుతుందంటూ సింధు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సింధ్ ప్రావిన్స్‌లో ముఖ్యంగా హిందూ, క్రిస్టియన్ సామాజికవర్గాలకు చెందిన మైనర్ బాలికలను బలవంతంగా పెళ్లిచేసుకునే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు 2014లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికల వివాహం చెల్లదు. అయినా, ఈ చట్టాన్ని కాదని సింధ్ హైకోర్టు తీర్పును వెలువరించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల పాకిస్థానీ క్రిస్టియన్ బాలిక హూమాను అబ్దుల్ జబ్బార్ అనే వ్యక్తి అపహరించి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమేనని, ఈ వివాహం చెల్లదంటూ ఆమె తల్లిదండ్రులు సింధ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు, బాలిక వయసు తక్కువగా ఉన్నప్పటికీ ఆమెకు రుతుక్రమం ప్రారంభమైందని షరియా చట్టాల ప్రకారం ఒకసారి రుతుక్రమం పూర్తైనా ఆమె వివాహం చెల్లుతుందని తీర్పును వెలువరించింది.
ఈ సందర్భంగా హూమా తల్లిదండ్రుల తరపు న్యాయమాది తబస్సుమ్ మాట్లాడుతూ, సింధ్ బాల్య వివాహ చట్టానికి అనుగుణంగా కోర్టు తీర్పు వెలువడలేదని... తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.