1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:30 IST)

పాకిస్థాన్‌లో ముదిరిన అల్లర్లు : ఖాకీల కాల్పుల్లో ఏడుగురి మృతి!

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరిపోయింది. పాక్ ప్రధాని నవాజ్ షరీప్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రాజధాని ఇస్లామాబాద్‍‌లో వేలాది మంది చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రధాని అధికార నివాసం వద్దకు చొచ్చుకువచ్చిన ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఆందోళనకారులు కూడా పోలీసులపైకి తిరగబడ్డారు. వీరి దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  
 
దాదాపు 25 వేల మందితో పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రధాని అధికార నివాసానికి చేరుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రహదారిపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆందోళనకారులు తొలగించారు. దీంతో పోలీసులు తొలుత టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. 2013 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి నవాజ్ షరీఫ్ విజయం సాధించారని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఇస్లామిక్ మత గురువు ఖాద్రీ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.