సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:41 IST)

పాకిస్థాన్‌లో సోషల్ మీడియాపై సస్పెన్షన్ వేటు

పాకిస్థాన్ ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే సామాజిక మాధ్యమాలను శుక్రవారం కొద్ది గంటలపాటు నిలిపేసింది. ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సస్పెండ్ చేసినట్లు పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది. 
 
ఇదే అంశంపై పాక్ మీడియాతో ఆ దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారి ఒకరు మాట్లాడుతూ, మంత్రిత్వ శాఖ ఆదేశాలతో టెలికమ్యూనికేషన్ అథారిటీ సామాజిక మాధ్యమాలను సస్పెండ్ చేసిందని చెప్పారు. ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 
 
అయితే ఈ చర్యకు దారి తీసిన కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. పాకిస్థాన్ టెలికాం అథారిటీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ప్రజా భద్రత కోసం తాత్కాలికంగా కొన్ని సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఇతర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, టీఎల్‌పీకి చెందిన నిరసనకారులు శుక్రవారం ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చి, ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేయడం వల్ల ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 
 
 
ఫ్రాన్స్‌లో దైవ దూషణగా పరిగణించదగిన కేరికేచర్‌ను ప్రచురించడంపై టీఎల్‌పీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఫ్రెంచ్ రాయబారిని పాకిస్థాన్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీఎల్‌పీ నేత సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. హింసాకాండ చెలరేగడంతో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా తెలుస్తోంది.