సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:37 IST)

భర్తకు కరోనా పాజిటివ్ అని తేలడంతో భార్య ఆత్మహత్య

మహమ్మారి కరోనా పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. కరోనా వచ్చిన భర్త కోలుకుంటాడో లేదోనన్న మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక హనుమాన్ బస్తీకి చెందిన సుద్ధాల జలజ భర్తకు కరోనా సోకింది.
 
పరిస్థితి విషమించిడంతో ఆయన్ను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుడు కరోనా నుంచి కోలుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జలజ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
కరోనా విజృంభిస్తున్న వేళ మానవత్వాలు మంటగలుస్తున్నాయి. అపోహలు, అనుమానాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇంటి యజమాని కర్కశత్వం ఒక మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో జరిగిన సంఘటన మానవత్వ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెబుతోంది.
 
స్థానిక మహిళ ఇటీవల అనారోగ్యం పాలైంది. ఆసుపత్రిలో చూపించకోగా టెస్టులు చేసి కరోనా అని తేల్చారు. హోం ఐసోలేషన్లో ఉండేందుకు తిరిగి ఆమె ఇంటికి వచ్చింది. అయితే అద్దె ఇల్లు కావడంతో యజమాని లోనికి రానివ్వలేదు. తాళాలు కూడా తీయలేదు.
 
దీంతో ఒకరోజు మొత్తం రోడ్డుమీదే గడిపిందామె. తరువాత బాధితురాలి పరిస్థితిని చూసి స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. వారొచ్చి కరీంనగర్ తరలించి వైద్యం అందించారు. అంతలో పరిస్థితి విషమించి చనిపోయింది. ఇంటి ఓనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇంత దారుణమా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. 
 
ఇంకోవైపు చిత్తూరుజిల్లాలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో 14 మంది ఉపాధ్యాయులకు, 12 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో పాఠశాలలను మూసివేసి విద్యార్థులకు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.