గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:45 IST)

కరోనాతో భర్త మృతి.. భార్య ఏం చేసిందంటే..? మూడేళ్ల బిడ్డ బుడి బుడి అడుగులతో..?

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు అవుతోంది. భారత్‌లో గురువారం ఒక్కరోజే రెండు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు ఒక కోటీ 42 లక్షల 87 వేల 740 మందికి కరోనా సోకింది. లక్షల 74వేల 306 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ వచ్చిందనీ, ఇక భయం లేదని ప్రజలు ఆనందోత్సాహాలు చేసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ కరోనా మహమ్మారి జడలు విప్పుకుంది. 
 
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశాలన్నీ మళ్లీ సరిహద్దులు గీసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన యావత్ దేశ ప్రజలను కన్నీరు పెట్టించేలా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉపాధి నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లాడు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తూ గడుపుతున్నారు. 
 
అయితే ఉన్నట్టుండి ఈ కూలీ కుటుంబంలో కరోనా పెద్ద కల్లోలాన్నే సృష్టించింది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి భర్త మరణించాడు. భర్త అనారోగ్యంతో బాధపడుతోంటే కనీసం సపర్యలు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ భార్య ఉండిపోయింది. భర్త మరణించినా దూరం నుంచే చివరి చూపు చూడగలిగింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయింది. దీంతో తన మూడేళ్ల కొడుకును తీసుకుని స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లింది. బాబును ఒడ్డుపైనే వదిలేసి ఆ తల్లి మాత్రం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చెరువులోకి దూకడాన్ని ఆ మూడేళ్ల బాబు చూశాడు.
 
తన తల్లి ఎంతకూ రాకపోవడంతో అటువైపే వెళ్లిందన్న గుర్తుతో ఆ చెరువులోకి బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్లాడు. నీటిలోతుల్లోకి వెళ్ళిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే ఆ బాబు కూడా మరణించాడు. ఆ బాబు చెరువులోకి వెళ్తుండటాన్ని దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి ఉరుకుల పరుగులు మీద వచ్చాడు. కానీ ఈ లోపే ఘోరం జరిగిపోయింది. బాబు కనిపించలేదు. 
 
స్థానికుల సాయంతో చెరువులో వెతికిస్తే బాబు మృతదేహంతోపాటు తల్లి మృతదేహం కూడా లభ్యమయింది. దీంతో ఏం జరిగి ఉంటుందో వాళ్లు గ్రహించి కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి, తమ్ముడు మరణించారన్న వార్త తెలిసి మిగిలిన ఇద్దరు పిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.