భార్య కాపురానికి రావడం లేదనీ... మనస్తాపంతో భర్త...
హైదరాబాద్ నగరంలో ఓ భర్త బలవర్మణానికి పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావట్లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఫిలింనగర్‌లోని జగ్జీవన్‌రాం నగర్‌లో నివసించే విశ్వనాథ్(40)కు నవాబుపేట ప్రాంతానికి చెందిన సుమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన కొద్ది సంవత్సరాలకే ఇద్దరి మధ్యన తగాదాలు జరుగుతూ ఉండేవి. భార్యభర్తల గొడవ నేపథ్యంలో సుమలత తరచూ పుట్టింటికి వెళ్లిపోయేది.
ఈ క్రమంలో 2018లో జరిగిన గొడవ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. రావాలంటూ భర్త ఎన్నిసార్లు కోరినా అందుకు ఆమె అంగీకరించలేదు. మంగళవారం మరోసారి ఫోన్ చేసి రావాలని కోరినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విశ్వనాథ్.. ఇంట్లోనే ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతని తల్లి లింగమ్మ వెళ్లి చూసేటప్పటికే మృతి చెంది కనిపించాడు. గత నవంబరులోనూ ఇలానే భార్య రావట్లేదనే మనోవేదనతో సిలిండర్ గ్యాసు వదులుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు లింగమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.