సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 12 మార్చి 2017 (17:45 IST)

ఎడారిభూమిలో మోసులెత్తిన కారుణ్యం.. పనిమనిషిని గుర్తుపెట్టుకున్న మానవత్వం

భారతీయ పనిమనుషులను కుక్కల్లాగా చూస్తారని అపఖ్యాతి పొందిన సౌదీ అరేబియాలో తన ఇంట్లో ఎన్నడో పనిచేసిన ఒక పనిమనిషికోసం దేశం దాటి ప్రయాణించిన సౌదీ మహిళ గురించి వింటుంటే మానవత్వం ఎడారి నేలలో కూడా అరుదుగానైనా

భారతీయ పనిమనుషులను కుక్కల్లాగా చూస్తారని అపఖ్యాతి పొందిన సౌదీ అరేబియాలో తన ఇంట్లో ఎన్నడో పనిచేసిన ఒక పనిమనిషికోసం దేశం దాటి ప్రయాణించిన సౌదీ మహిళ గురించి వింటుంటే మానవత్వం ఎడారి నేలలో కూడా అరుదుగానైనా మోసులెత్తుతోందని అనిపించక మానదు. సౌదీలో ఇంట్లో పనిమనుషులుగా చేసేవారు చిత్రహింసలను ఎదుర్కొంటున్నట్లు ఎన్నో వార్తలు చదివి ఉంటారు. అక్కడ చట్టాలు కూడా సౌదీ పౌరులకు అనుకూలంగానే ఉంటాయి. యజమాని ఒప్పుకోనిదే వేరే చోట పనిచేయకూడదు. అసలు దేశం కూడా దాటనివ్వరు. చాలామంది యజమానులయితే పనిమనుషులను ఓ బానిసలా చూస్తుంటారు.

వీళ్లలాగానే.. పనిమనుషులను తమ ఇంటివారిలాగా చూసుకునేవారు కూడా ఉంటారు. తమ ఇంట్లో పనిచేసిన మహిళను గుర్తు పెట్టుకుని మరీ చూసేందుకు వెళ్లింది. యోగక్షేమాలను కనుక్కుంది. అయితే ఆమె ఏ పక్క ఊరికో వెళ్లిందనుకుంటే పొరపాటే.. కేవలం పనిమనిషిని చూసేందుకు సౌదీ నుంచి శ్రీలంకకు ప్రయాణం చేసిందంటే ఆమెను నిజంగానే మెచ్చుకోవలసిందే మరి.
 
విషయంలోకి వస్తే...  శ్రీలంకకు చెందిన సరోనా 1989లో సౌదీ నివాసి అబ్దుల్‌అజీజ్ ఖలీఫా అల్ జక్రీ అనే వ్యక్తి ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.  జక్రీ కుటుంబంలో చాలా మంది సభ్యులున్నారు. ఆయన అన్నదమ్ములు వారి పిల్లలు అందరు ఒకే ఇంట్లో ఉంటారు. అంతమంది ఉన్నా.. ఆ ఇంట్లో అందరి అవసరాలేంటో సరోనాకే బాగా తెలుసు. ఎవరికి ఏం కావాలన్నా సరోనానే అడిగేవారు.
 
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారారు. వారితోపాటు కొత్తింట్లో అడుగుపెట్టిన సరోనాకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. మేడపై నుంచి  కింద పడి ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె స్వదేశమయిన శ్రీలంకకు పంపించారు. 
 
సాధారణంగా అయితే ఇంట్లో పనిమనిషి మానేస్తే.. వాళ్లను ఎవరూ గుర్తుపెట్టుకోరు. కొత్త పనిమనిషిని పెట్టుకుని తమ అవసరాలను తీర్చుకుంటుంటారు. కానీ జక్రీ కుటుంబం అందుకు అతీతం.. ఫోన్ ద్వారా ఆమె ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు ఆర్థికంగా కూడా సహయపడుతున్నారు. ఆమె పిల్లలను కూడా వారి సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జాక్రీ భార్య  శ్రీలంకకు వచ్చి సరోనాను పరామర్శించి వెళ్లింది. అన్ని విషయాల్లో అండగా ఉంటామని ఆమెకు భరోసా కల్పించారు. ఏదిఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదే అని చెప్పుకోవాలి. 
 
పనిమనుషుల పట్ల కరుణ లేని గల్ఫ్ భూమిలో కృతజ్ఞతను ప్రదర్శించేవారు కూడా ఉంటారని ఇప్పుడే వింటున్నాం కదూ..