ఆ గ్రామంలో మహిళలు పిల్లల్ని కనరాదు.. శవాలను పూడ్చిపెట్టరాదు...
అంతరిక్షంలోకి మనిషి వెళ్లి తిరిగి వస్తున్న ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. అంతేనా, భూమిమీద జరిగే చిన్న విషయాన్ని కూడా అంతరిక్షం నుంచి ఫోటోలు తీసి సమాచారాన్ని అందించే రాకెట్స్ శాంకేతికంగా దూసుకుపోతున్నాం. కానీ, సౌతాఫ్రికాలోని దక్షిణ ఘనాలో ఉన్న మాఫీ డవ్ అనే గ్రామంలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఆ ఆచారం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య కలిగిస్తోంది. ఈ గ్రామంలో మహిళలు ప్రసవించరాదు.. చనిపోయిన వారిని పాతిపెట్టరాదు. ఇదే ఈ గ్రామ వింత ఆచారం. పైగా అనాదిగా వస్తున్న ఇలాంటి ఆచారాన్ని ఆ గ్రామస్తులు వ్యతిరేకించక పోవడం గమనార్హం.
ఈ వివరాలను పరిశీలిస్తే, మాఫీ డవ్ గ్రామంలో దాదాపుగా 5 వేల మంది జనాభా ఉంటుంది. వీరంతా ఈ గ్రామ గడ్డపై పుట్టినవారు కాదు. మరి ఎక్కడ పుట్టారన్నదే కదా మీ సందేహం. ఆ గ్రామానికి చెందిన మహిళలు గర్భందాల్చవచ్చు. కానీ ప్రసవం మాత్రం గ్రామంలో జరగటానికి వీల్లేదు. అంటే ప్రసవం రోజు దగ్గర పడేకొద్ది నెలల ముందే వారు వేరే గ్రామాలకు వెళ్లిపోతారు. అక్కడే బిడ్డను కని, బిడ్డ బొడ్డు తాడు ఊడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామానికి రావాలి. ఇక ఎవరైనా చనిపోయినట్లయితే.. వారిని ఆ గ్రామంలో పాతిపెట్టరు. ఖననం చేయరు. పక్క గ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు.
అంతేకాదు మాఫీ డౌవ్‌లో ఎవ్వరూ జంతువుల్ని పెంచుకోరాదు. అలాగని వారు మాంసం తినరా అంటే అదేంలేదు. చక్కగా ఆరగిస్తారు. ఎలాగంటే.. జంతువుల్ని గ్రామానికి తీసుకొస్తారు. అలా గ్రామానికి తీసుకొచ్చిన రోజే దాన్ని వధించి తినేస్తారు. ఒక్క రోజు ఎక్కువ ఉంచినా ఆ గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినట్లే.
అయితే ఈ గ్రామస్తులు ఈ తరహా ఆచారాన్ని పాటించడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. టాగ్బే గబెవొఫియా అకిటీ అనే వేటగాడు మొదటిసారిగా ఈ గ్రామంలో అడుగుపెట్టాడు. ఆయనకు ఆకాశవాణి వినిపించింది. "మాఫీ డౌవ్ చాలా ప్రశాంతమైన ప్రాంతం. అక్కడ ప్రజలు జీవించాలంటే పిల్లలను ప్రసవించకూడదు. జంతువులను పెంచకూడదు. శవాలను పూడ్చిపెట్టకూడదని ఆకాశవాణి అకిటీకి చెబుతుందట. దీంతో అప్పటి నుంచి ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్క ఆచారాన్ని తప్పినా దేవుడికి కోపం వస్తుందని మాఫీ డౌవ్ గ్రామస్తులు నమ్ముతు.. పాటిస్తు వస్తున్నారు.