సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:55 IST)

నా స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమైంది: అబ్ధుల్ ఖాదిర్

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఎంపీ అబ్దుల్ ఖాదిర్ జజాయ్ మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ మధ్య శాంతి చర్చలు జరిగాయని, దీంతో కాబుల్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 
 
తాలిబన్‌ను సమర్థిస్తున్న దేశాలలో పాకిస్థాన్ ఒకటన్నారు. తన కుటుంబం ఇంకా కాబూల్‌లోనే ఉందని తెలిపారు. ఇదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుని సీనియర్ సలహాదారు రిజ్వానుల్లా అహ్మద్‌జాయ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, కాబూల్‌లోని రాజకీయనేతలంతా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేశారన్నారు.
 
200 మంది ప్రముఖులు ఢిల్లీ చేరుకున్నారని తెలిపారు. మరో ఎంపీ సయ్యద్ హసన్ మాట్లాడుతూ.. తాము తమ దేశాన్ని విడిచిపెట్టాలనుకోవడం లేదన్నారు. ఇక్కడ తాము ఒక సమావేశానికి వచ్చామని, అది ముగియగానే తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోతామన్నారు. 
 
కాగా కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రపంచం మద్దతుగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. తన స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అక్కడ ఎటువంటి అధికారాలు లేవని వాపోయారు.