శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By IVR
Last Modified: శనివారం, 2 మే 2015 (15:17 IST)

తానా 20వ మహాసభల సందర్భంగా జాతీయ ఆటల పోటీలు ప్రారంభం

జూలై మాసంలో జరుగనున్న తానా మహాసభల సందర్భంగా డెట్రాయిట్‌లో జాతీయస్థాయిలో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. చెస్, క్యారమ్స్ పోటీలతో శ్రీకారం చుట్టడం జరిగింది. నోవై నగరంలో డెట్రాయిట్ ఇండియన్ సెంటర్(డైస్) హాల్‌లో చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఉత్సాహభరిత వాతావరణంలో, కోలాహలంగా సాగిన ఈ ఆటల పోటీలలో విజయరావు చైర్‌పర్సన్‌గా, చంద్ర అన్నవరపు, వంశి దేవబత్తుని కోచైర్స్‌గా డిటియె స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సుధీర్ బచ్చు, తానా డిటియె సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డిటియె ఆధ్వర్యంలో శ్రీనివాస్ గోనుగుంట్ల, తానా మహాసభల కోర్ కమిటి సభ్యులు స్పోర్ట్స్ అడ్వయిజర్ రఘు రావిపాటి  నేత్రుత్వంలో ఈ పోటీలు అంచనాలకి మించి జయప్రదంగా నిర్వహింపబడ్డాయి.
   
ఈ పోటీలలో 8 ప్రధాన ఈవెంట్లు నిర్వహింపబడుతున్నాయి. మొదటి ఈవెంటుగా నిర్వహింపబడిన చెస్, క్యారమ్స్‌కి అపూర్వ స్పందన లభించాయి. మోహన్ సోమసాగర్, స్వాతి సోమసాగర్, మాధవి గార్లతో కలిసి అందించిన ఉపాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లకు ప్రత్యేక స్పందన లభించాయి.

 
ఈ ఆటల పోటీలలో క్యారమ్స్ విభాగంలో 64 మంది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రధాన నగరాల నుండి మరియు కెనడా నుండి కూడా పాల్గొనటం విశేషం. కొలంబస్ నుండి పాల్గొన్న ఉమా మునగాల, వేణు ముక్కెర విజేతలుగా నిలిచారు. ద్వితీయ స్థానంలో ట్రయ్ నగరానికి చెందిన ప్రణీతి మెరుగు, జేవియర్ చింతా నిలిచారు. విజేతలకు ట్రోఫీస్ మరియు నగదు బహుమతులు అందచేసారు.  క్యారమ్స్‌లో ప్రత్యేక ప్రతిభ చూపిన కెనడా వాస్తవ్యులు నాగేంద్ర కుమార్, విలాస్‌లకు ప్రత్యేక నగదు బహుమతిని అందచేసారు.              
 
చెస్ పోటీలలో 40 మందికి పైగా వివిధ వయస్సు వాళ్ళు, వివిధ కేటగరీలలో పాల్గొన్నారు. 5-8 వయస్సు గ్రూప్‌లో అక్షయ్ పులగంటి ప్రధమ స్థానం, రోషన్ షా ద్వితీయ స్థానం సాధించారు. 9-13 వయస్సు విభాగంలో సాత్విక్ సూర్యదేవర, రవి కరణం ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ట్రోఫీస్ మరియు నగదు బహుమతులు అందచేసారు.

 
ప్రారంభ పోటీలకు అపూర్వ స్పందన రావటం నిర్వాహకులకు ఉత్సాహం కలిగించింది. ఈ పోటీలను తిలకించిన వాళ్ళల్లో తానా మహాసభల కార్యదర్శి శ్రీనివాస్ గోగినేని, రీజనల్ కో-ఆర్డినేటర్ జోగేశ్వర్రావు పెద్దిబోయిన, ఇండియా నుండి వచ్చిన ప్రముఖులు అలపర్తి పిచ్చయ చౌదరి తదితరులు వున్నారు. తానా మహాసభల కన్వీనర్ గంగాధర్ నాదెళ్ళ, తానా అధ్యక్షులు మోహన్  నన్నపనేని ఈ క్రీడలు నిర్వహిస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తపరిచారు.