శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (16:30 IST)

థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు అరెస్టు.. చికోటీ ప్రవీణ్ కూడా..

chikoti pravin
థాయ్‌ల్యాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. ఆసియా పట్టయా హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఈ గ్యాంబ్లింగ్ నిర్వస్తుండగా థాయ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి మొత్తం 93 మందిని అరెస్టు చేశఆరు. వీరిలో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా హైదరాబాద్ క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. 
 
పటాయా హోటల్‌కి థాయ్ పోలీసులు ప్రవేశించిన సమయంలో గ్యాంబ్లర్లు వివిధ రకాలైన క్రీడలు ఆడుతున్నారు. పోలీసులను చూడగానే వారంతా పోరిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చుట్టుముట్టి అరెస్టు చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నిందితుల నుంచి రూ.1.60 లక్షల భారతీయ కరెన్సీ, రూ.20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్, 93 మొబైల్ ఫోన్లు, 8 సీసీటీవీలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హోటల్‌లో దాదాపు రూ.100 కోట్ల మేరకు గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. థాయ్ నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఈ హోటల్‌లో సోదాలు నిర్వహించి, ఈ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. పైగా, ఈ గ్యాంబ్లింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలు భారత్ నుంచి థాయ్‌కు తీసుకెళ్లినవి కావడం గమనార్హం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.