సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (11:50 IST)

విమానంలో ప్రయాణికుడి అర్థనగ్న ప్రదర్శన... విమాన సిబ్బందిపైదాడి..

British man
థాయ్ ఎయిర్ వేస్‌ విమానంలో బ్రిటన్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అర్థనగ్నంగా రచ్చరచ్చ చేశాడు. అతన్ని వారించబోయిన విమాన సిబ్బందిపై కూడా చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
ఈ నెల 7వ తేదీన బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు తొలుత విమానం టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా పెద్ద పెట్టున అరుస్తూ బాత్రూమ్ తలుపులపై గట్టిగా చరిచి వాటిని విరగ్గొట్టాడు. అర్థనగ్న స్థితిలో నానా రభసా సృష్టించాడు. ఇదంతా చూసిన ఇతర ప్రయాణికులు అతడిని నిలువరించే ప్రయత్నం చేయగా, వారితో గొడవకు దిగాడు. 
 
ఈ క్రమంలోనే అక్కడికొచ్చిన క్రూ సిబ్బందిలో ఒకరిపై నిందితుడు చేయిచేసుకున్నాడు. అతడి ముష్టిఘాతాలకు బాధితుడి ముక్కు విరిగిపోయింది. ఈలోపు ఇతర ప్రయాణికులు అతడి చేతులు కట్టేసి సీటులో కూర్చోపెట్టారు. ప్రయాణం ముగిసే వరకూ పక్కనే ఉండి అతడు కదలకుండా నిలువరించారు. 
 
అయినా కూడా అతడు దుర్భాషలాడుతూ నానా రభస సృష్టించాడని ఇతర ప్రయాణికులు తెలిపారు. లండన్‌లోని హిత్రూ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి దిగినందుకు, విమానాన్ని ప్రమాదంలో పడేసినందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.