బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (16:01 IST)

నష్టపరిహారం ఇవ్వండి : ఇరాన్‌కు ఉక్రెయిన్ వినతి

తమ బోయింగ్ విమానాన్ని కూల్చివేసి అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం కలిగించినందుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమి జెలన్‌స్కీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన శనివారం ఓ ప్రకటన చేశారు. తమ బోయింగ్ విమానం కూల్చివేత‌కు బాధ్యులైన‌ వారిని ఇరాన్ కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరారు. 
 
ఇటీవల టెహ్రాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 176 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం సాంకేతిక లోపం వల్ల కూలిపోలేదని, ఇరాన్ సైనికులు ఉద్దేశ్యపూర్వకంగా మిస్సైల్ దాడి చేసి కూల్చివేసినట్టు ఆధారాలతో సహా తేలింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు తలెత్తడంతో ఇరాన్ నిజాన్ని అంగీకరించింది. ఇది మానవతప్పిదంగా పేర్కొంటూ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది. 
 
ఇదిలావుంటే ఉక్రెయి అధ్యక్షుడు ఈ ఘటనపై స్పందించరాు. టెహ్రాన్ విమాన‌ దుర్ఘ‌ట‌న‌లో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటువంటి ఆల‌స్యం జ‌ర‌గ‌కుండా విచార‌ణ పూర్తి చేయాల‌ని, ఉక్రెయిన్‌కు చెందిన 45 మంది నిపుణుల‌కు విచార‌ణ కోసం అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. కెన‌డా ప్ర‌ధాని జెస్టిన్ ట్రూడో కూడా ఇరాన్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించారు. బాధిత కుటుంబాల‌కు పార‌ద‌ర్శ‌కంగా ఇరాన్ న్యాయం చేయాల‌ని ట్రూడో కోరారు. ఉక్రెయిన్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో సుమారు 50 మంది కెన‌డియన్లు ఉన్నారు.