పీవీకి భారతరత్న ఇవ్వాలి : బీజేపీ ఎంపీ డిమాండ్
భారతీయన జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతరత్న పురస్కారానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు పూర్తిగా అర్హుడని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా, దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక నిపుణుడిని ఆర్థికమంత్రిగా పీవీ ఎంచుకోవడం ఆయన ముందుచూపుకు నిదర్శనమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా కంటే ఆర్థిక మంత్రిగానే ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చారని స్వామి గుర్తుచేశారు.
ప్రధానిగా పీవీ నరసింహా రావు ప్రోత్సాహం వల్లే మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, ఈ గొప్పతనం పీపీదేనని స్వామి స్పష్టం చేశారు. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికైనా పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, కాశ్మీరు లోయ మొత్తం భారత్‌లోని అంతర్భాగమని పార్లమెంట్‌లో తీర్మానించిన ఘనత కూడా పీవీదేనని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే కాశ్మీరులో ఆఖరి ఘట్టమని పీవీ ధైర్యంగా చెప్పారని స్వామి గుర్తు చేశారు.
అంతేకాకుండా, వివాదాస్పదంగా ఉన్న బాబ్రీ మసీదు కింద ఓ హిందూ ఆలయం ఉందన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయితే, ఆ స్థలం, ప్రాంతాన్ని తమ ప్రభుత్వం హిందువులకు అప్పగిస్తుందని పీవీ సుప్రీంకోర్టుకు విన్నవించారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తుచేశారు. అందువల్ల పీవీకి దేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కోరారు.