శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (17:09 IST)

బిట్రగుంటలో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయండి : ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్‌గా పేరు గడించిన బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని కానీ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మెయింటినెన్స్ సెంటరును కానీ క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్‌షాపును కానీ ఏర్పాటు చేయమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
 
శూన్యగంటలో ఆయన మాట్లాడుతూ గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ మానుఫాక్చరింగ్ యూనిట్‌ను శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయినా అధికారులు సంబంధిత వర్గాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదని, అందువల్ల ఇది కార్యాచరణకు నోచుకోలేదని గుర్తుచేశారు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా ఫలితం లేకుండా ఉందని చెప్పారు. 
 
బిట్రగుంటలో 1100 ఎకరాల రైల్వే స్థలం ఈ కారణంగా వృధాగా ఉందని గుర్తు చేశారు. దేశంలోనే పెద్దదైన లోకో షెడ్‌లలో బిట్రగుంట లోకో షెడ్ ఒకటని పేర్కొన్నారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లు రావడం వల్ల ఈ షెడ్డు మూతపడింది తెలిపారు. 1885లో నిర్మితమైన ఈ షెడ్లో 1934లో రౌండ్ హౌస్ ఏర్పాటయిందని చెప్పారు. ఇక్కడ 50 లోకోమోటివ్ ఇంజన్ల సామర్థ్యం ఉండేదని, దాంతోపాటు మేజర్ యార్డు కూడా కలిగి ఉందని తెలిపారు. 
 
పాసింజరు, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డ్రైవర్లు, గార్డులను మార్చే కేంద్రంగా ఉండేదని, ఇప్పటికీ పరిమితంగా అయిన ఆ పని చేస్తూనే ఉందని తెలిపారు. ఇక్కడ  అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నందున తక్షణం ఒక రైల్వే  ప్రాజెక్టును చేపట్టి పూర్వవైభవాన్ని తేవాలని కోరారు. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాన్ని ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా న్యాయం చేయవచ్చునని విజ్ఞప్తి చేశారు. తక్షణం రైల్వే శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.