శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (09:05 IST)

శ్వేతసౌథంలో తొలి కరోనా కేసు.... అగ్రరాజ్యం అప్రమత్తం

అగ్రరాజ్యం అమెరికా పాలనా కేంద్రమైన శ్వేతసౌథంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని ఓ సభ్యుడుకి ఈ వైరస్ సోకినట్టు తాజాగా తేలింది. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ దేశంలో 18 మంది ఈ వైరస్ బారినపడగా, సుమారుగా 250 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదు కావడం ఆందోళనకు గురయ్యారు. కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసి ఉంటాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, అతడు అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ, ఉపాధ్యక్షుడితో కానీ నేరుగా కలవలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరోవైపు, ఈ మధ్యకాలంలో అతడు కలిసిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ట్రంప్ కలిసిన పలువురు వ్యక్తులు కరోనా బారిన పడటంతో ఆయన కూడా గతవారం పరీక్షలు చేయించుకున్న విషయం తెల్సిందే. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో శ్వేతసౌథం అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి 230 మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్‌లో అత్యధికంగా 74 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లో ఏకంగా పదివేల కొత్త కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18 వేలు దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించి ఆర్మీని రంగంలోకి దింపింది.