శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (07:50 IST)

కరోనా వైరస్ సోకితే రోగిలో సరికొత్త వ్యాధి లక్షణాలు.. ఏంటవి?

కరోనా వైరస్.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఓ మహమ్మారి. ఈ వైరస్ ధాటికి అనేక ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఎన్నో అందమైన దేశాలు ఇపుడు అంద విహీనంగా కనిపిస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైంది. ఇదేవిధంగా అన్ని రంగాలు కుదేలైపోయాయి. చివరకు పలు దేశాల ప్రభుత్వాలు కూడా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించాయంటే ఈ కరోనా వైరస్ భయం ఎంతలా పట్టిపీడిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాన్ని శరవేగంగా తన కోరల్లో బంధింస్తోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల విధానాలను అనుసరిస్తున్నారు. సాధారణంగా ఈ వైరస్ బారినపడితే జ్వరం, గొంతునొప్పి, పొడిదగ్గు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 
 
ఇపుడు తాజా వీటికి మరిన్ని లక్షణాలు కూడా తోడయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుంది. 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కూడా ఈ వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది. 
 
కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించింది. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు మొదట జ్వరం వస్తుంది. ఇంతేకాకుండా, అలసట, కండరాల నొప్పులు, పొడి దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో కొంతమందికి ఒకటి లేదా రెండు రోజుల పాటు వాంతులు లేదా విరేచనాలు అవుతాయి.