1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (13:15 IST)

అంత్యక్రియలు చేయలేని దయనీయస్థితిలో ఇటలీ వాసులు

కరోనా వైరస్ కబళించిన దేశం ఇటలీ. ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని ఇటలీ అల్లకల్లోలమైపోయింది. ప్రపంచంలోనే ఎంతో అందమైన దేశంగా గుర్తింపు పొందిన ఇటలీలో ఇపుడు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇటలీ రోడ్లపై పెంపుడు జంతువులు మినహా కనీసం ఒక్కరంటే ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. 
 
పైగా, కరోనా వైరస్ బారిన మృత్యువాతపడిన అయినవారి అంత్యక్రియలను కూడా నిర్వహించలేని దయనీయస్థితిలో ఇటలీవాసులు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి అయినవారికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చినా... శ్మశానవాటికలు మూతపడివున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మృతదేహాల అంత్యక్రియలు కూడా జరుపుకోలేని దుస్థితినెలకొంది. 
 
చైనా తర్వాత కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశం ఇటలీ. కరోనా వైరస్ బారిన పడిన పలువురు బాధితులు క్వారంటైన్‌లో ఒంటరిగా ఉంటూ ఏకాకిగానే చనిపోతున్నారు. ఇలాంటివారి అంత్యక్రియలకు అయినవారు సైతం హాజరుకాలేకపోతున్నారు. 
 
కరోనా వైరస్ భయం ముందు... శతాబ్దాలుగా కొనసాగుతున్న అన్ని సామాజిక ఆచారాలు దిగదుడుపుగా మారాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీలో కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇటలీలోని పలు ప్రాంతాలలో మృతదేహాల అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.
 
పైగా, అంత్యక్రియలతో సహా ఏ కార్యక్రమంలోనైనా ప్రజలు గుమిగూడటం నిషిద్ధమని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో సమూహంగా వెళ్లి అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. 
 
ఇటలీలోని బెర్గామో పట్టణంలోని ఒక ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడిన 85 ఏళ్ల రాంగో కార్లో టెస్టా తుదిశ్వాస విడిచాడు. అయితే ఐదు రోజుల వరకు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగలేదు. టెస్టా భార్య ఫ్రాంకా స్టెఫాన్లీ తన భర్త మృతదేహానికి ఆచారాల ప్రకారం ఖననం చేయాలనుకుంది. అయితే ఇటలీలో విధించిన ఆంక్షల కారణంగా అంత్యక్రియలను సంప్రదాయం ప్రకారం జరపలేకపోయింది.
 
అలాగే, ఫ్రాంకాతో పాటు ఆమె కుమారుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వారిని కరోనా అనుమానిత కేసులుగా భావించి, ఏకాంతంలో ఉంచారు. ఫలితంగా వీరు తమ ఇంటి పెద్ద అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. ఇటువంటి పరిస్థితులు ఇటలీ ప్రజలను మరింతగా కలచివేస్తున్నాయి.