శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (13:21 IST)

దేశంలో కరోనా ముప్పును గ్రహించిన తొలి ధార్మిక సంస్థ తితిదే?!

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన తొలి ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కావడం గమనార్హం. ఆతర్వాత దానికనుగుణంగా సంబంధిత ప్రభుత్వాల నుంచి ఎప్పటికపుడు తితిదే హెచ్చరికలు చేస్తూ, సూచనలు జారీ చేస్తూ వచ్చింది. ఇందులోభాగంగానే తొలుత ఆలయంలో అర్జిత సేవలను రద్దు చేసింది. ఇపుడు ఏకంగా వారం రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. 
 
చైనాలోను వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. తొలుత చైనా, ఆ తర్వాత ఇటలీ, ఇరాన్ దేశాల్లో వ్యాపించి, ఇపుడు ప్రపంచాన్ని కబళించింది. భారత్‌లో కరోనా కల్లోలం రేపుతుందన్న సమయాన్ని ముందుగానే తితిదే పసిగట్టి అప్రమత్తమైంది. 
 
ఎందుకంటే రోజువారీ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది భక్తులు తిరుమల వస్తుంటారు. వారాంతాల్లో, ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య రెట్టింపవుతూ ఉంటుంది. ఆ దృష్ట్యా కరోనా వైరస్‌ ప్రబలే విషయంలో తిరుమలను హైరిస్క్‌ సెంటరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. 
 
దానికనుగుణంగా సంబంధిత ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు తితిదేకి హెచ్చరికలు, సూచనలు జారీ అవుతూనే వున్నాయి. ఈ కారణంగానే తితిదే తొలుత ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది. 
 
ఆ తర్వాత పిల్లలు, వృద్ధులతో తిరుమలకు రావద్దంటూ విజ్ఞప్తి చేసింది. విస్తృత ప్రచారం కూడా చేపట్టింది. ఆపై పగటి పూట జరిపే ఆర్జిత సేవలన్నీ రద్దు చేసింది. వాస్తవానికి తితిదే పదేపదే చేసిన విజ్ఞాపనలతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 
 
కానీ పూర్తిగా ఆగలేదు. తాజాగా శ్రీవారి పుష్కరిణిని కూడా మూసివేసింది. ఇలా భక్తుల రాకను ఎంతగా నియంత్రించాలని టీటీడీ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. 40 వేలకు తగ్గకుండా భక్తులు తరలివస్తూనే వున్నారు.
 
ఈ దశలో గురువారం నాటి యూపీ భక్తుడి ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన 110 మంది భక్తుల బృందంలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో తితిదే అప్రమత్తమైంది. ఆయనను తదుపరి పరీక్షలకు స్విమ్స్‌కు పంపుతూ, మిగతా 110 మంది భక్తుల సంచారాన్ని తిరుమలలోనే కట్టడి చేసింది. 
 
అవసరమైతే వారి కదలికలను సీసీ టీవీ ఫుటేజిలో గుర్తించి ఇరుగుపొరుగు భక్తులను అప్రమత్తం చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే.. అదృష్టవశాత్తు ఆ భక్తుడి కరోనా పరీక్ష నెగెటివ్‌ ఫలితం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలా పకడ్బంధీ చర్యలతో తిరుమల గిరుల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా తితిదే అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహించారు.