శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (11:57 IST)

కరోనా మహమ్మారికి చైనాయే కారణం.. డ్రాగన్‌పై విరుచుకుపడిన ట్రంప్

కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని హరించేందుకు చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందుగా మనకు సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) చేసిన ట్వీట్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా వైరస్‌పై ప్రాథమిక వివరాలను బయటకు పొక్కకుండా నొక్కివేసిందని, దీంతో ఈ మహమ్మారిని నిరోధించే అవకాశం చైనా, అంతర్జాతీయ వైద్య నిపుణులకు లేకుండా పోయిందని ఎన్‌ఎస్‌ఈ చేసిన ట్వీట్‌ కలకలం రేపింది.
 
ఇక ఈ వైరస్‌ గురించి ముందుగా తెలిసిన వారు దాన్ని అక్కడే నిలుపుదల చేసి ఉండాల్సిందని, వారు చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా వైరస్‌ బారిన పడి విలవిలలాడుతోందని, ఇది సరైంది కానేకాదని చైనా తీరును ట్రంప్‌ తప్పుపట్టారు.
 
అలాగే ఈ క్రమంలోనే కరోనా వైరస్‌కు ఓ మెడిసిన్ ద్వారా చెక్ పెట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ భయంకర కోవిడ్-19కు మలేరియా చికిత్సలో వాడే 'క్లోరోక్విన్‌' ద్వారా నయం చేయవచ్చని చెప్పారు.
 
ఇప్పటికే దీనికి అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డిఏ) ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో ఎఫ్‌డిఏ వారి కృషి చాలా ఉందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇంకా మరిన్ని యాంటీవైరల్ ఔషధాలకు ఎఫ్‌డిఏ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.