కరోనా కల్లోలం : తిరుమలలో 128 యేళ్ళ తర్వాత అసాధారణస్థితి
కలియుగ ప్రత్యక్షదైవం కొలువైవున్న తిరుమలలో 128 యేళ్ల తర్వాత తొలిసారి అసాధారణ పరిస్థితి నెలకొంది. ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (తితిదే) అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో కలకలం సృష్టించింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో అంచెలంచెలుగా అనేక చర్యలు తీసుకుంటూ భక్తుల రాకపై పరిమితులు విధిస్తూ వచ్చిన టీటీడీ గురువారం అంతిమ నిర్ణయం తీసేసుకుంది. గత వందేళ్ల కాలంలో శ్రీవారి దర్శనానికి భక్తులను నిషేధించిన దాఖలాలు లేవు.
ప్రస్తతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం చివరి సారిగా 128 ఏళ్ల కిందట 1892లో అప్పటి హథీరాంజీ మఠం మహంతుకు, ఆలయ జియ్యంగార్లకు నడుమ తలెత్తిన ఆధిపత్య వివాదంతో రెండు రోజుల పాటు ఆలయం మూతపడింది. మళ్లీ ఇంతటి సుదీర్ఘ విరామం తర్వాత ఇపుడు ఆలయం మూతపడకపోయినా భక్తులకు ప్రవేశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా, తితిదే అనుబంధ ఆలయాల్లో దర్శనాలు రద్దుచేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పూజలు, కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వెంకన్న ఆలయం, కపిలతీర్థం, గోవిందరాజస్వామి, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని అనుబంధ ఆలయాల్లో దర్శనాలు రద్దుచేయాలని నిర్ణయించారు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ విధానం కొనసాగించనున్నారు.