శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: శనివారం, 27 సెప్టెంబరు 2014 (17:58 IST)

చిరంజీవితో అవకాశం వస్తే వదులుకోను: బండ్లగణేష్‌

ఫౌల్ట్రీ యజమాని నుంచి నటుడిగా కెరియర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ... మెగా ఫ్యామిలీ హీరో చిత్రాలతో కాలు మోపారు. పవన్‌ కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని నిర్మించి.. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో 'గోవిందుడు అందరివాడేలే' నిర్మించారు. అవసరమైతే మెగాస్టార్‌ చిరంజీవితో తీయడానికి రెడీ అంటున్న ఆయన చెప్పిన సంగతులు...
 
'గోవిందుడు..'  ఏ తరహా చిత్రమవుతుంది? 
ఇది పక్కా తెలుగు సినిమా. మన పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ ఉట్టిపడే సినిమా. పండుగనాడు కుటుంబమంతా కలిసి చూసేట్లుగావుంటుంది. 
 
ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? 
నేను మొదటినుంచి చెబుతున్నట్లే అక్టోబర్‌ 1న విడుదల చేస్తున్నాం. నిన్నటినుంచి నేనుకూడా టెన్షన్‌ పడుతున్నాను. ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు చూపించాలనే ఆతృతతో వున్నాను. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న ఉదయం 5.23 గంటలకు విడుదల చేస్తామని ముందే చెప్పాను. అనుకున్నట్లు ముందుగానే అంటే 5 నిముషాల ముందుగానే మొదటి షో వేస్తాం.
 
రీష్యూట్‌ చేయాల్సిన సందర్భం గురించి వివరిస్తారా? 
ఇందులో మొదటగా తమిళనటుడు రాజ్‌కిరణ్‌ చేశారు. ఆయన మన నేటివిటీకి సరిపోతాడో లేదోనని అనుకున్నాం. కొంత భాగం చేశాక... ఎక్కడో తేడా వస్తుందని భావించి దర్శకుడు కృష్ణవంశీ.. ప్రకాష్‌రాజ్‌ను అడిగారు. ఆయన వెంటనే అంగీకరించారు. అసలు ఆయనకంటే ముందుగా హీరో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. చేసిన సీనే మళ్ళీ చేయాలంటే ఓపిక కావాలి. ఇలా మాకు ఎంతో మంది సహకరించారు. పరుచూరి బ్రదర్స్‌, కెమెరా సమీర్‌రెడ్డి ఎంతో తోడ్పడ్డారు.
 
'ఎ' సర్టిఫికెట్‌ అంటే పెద్దల సినిమానా? 
కాదు. కుటుంబ సినిమా. సెన్సార్‌వారికి ఏవో కొంత యాక్షన్‌లో హింస వుందని రక్తపాతం చూపించాని అలా ఇచ్చారు. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. వారెంతగానో అభినందించారు.
 
ఎటువంటి చిత్రమవుతుంది? 
బాపుగారి 'ముత్యాలముగ్గు' ఎంత పేరు వచ్చిందో అచ్చమైన తెలుగు సినిమాగా గోవిందుడు... కృష్ణవంశీకి పేరు వస్తుంది. ఈ చిత్రం అద్భుత కావ్యంలా వచ్చింది అన్నారు. ఈ చిత్రానికి పలు అవార్డులు వస్తాయనే నమ్మకముందని అన్నారు.
 
ఎన్ని సెంటర్లలో విడుదలవుతుంది? 
దాదాపు 1800 నుంచి 2వేల వరకు అనుకుంటున్నాం. ఇంకా రెండురోజుల్లో పూర్తి వివరాలు వస్తాయి. 
 
చిరంజీవితో సినిమా చేస్తున్నారా? 
అటువంటి అవకాశం వస్తే వదులుకోను. నేనేకాదు ఎవ్వరూ వదులుకోరు. ఆయనతో చేయాలని నాకూ వుంది. దాని కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాను.
 
సినిమా చూశాక మీకెలా అనిపించింది? 
నేనైతే ఏడ్చేశాను. సాధారణంగా చాలా తక్కువ. పవన్‌గారి 'అత్తారింటికి దారేది' సినిమాలో క్లైమాక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌గారు తన అత్తదగ్గర మోకాళ్ళపై కూర్చొన్నప్పుడు ఏడ్పేవచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చూశాక దాదాపు 10 సీన్లవరకు ఏడ్చేశాను.
 
ఈ సినిమా ఎంత రేంజ్‌లో హిట్‌ అవుతుందనుకుంటున్నారు? 
నేనైతే ఇండస్ట్రీ హిట్‌ అవుతుందనుకుంటున్నాను. ఆశ వుంది. మిగిలినది దేవుడి దయ. ఆయన దయలేకపోతే సినిమా ఏదీ అవ్వదు. నాకు తెలిసి జన్యూన్‌గా ఈ సినిమా పలు అవార్డులు పొందుతుంది.
 
ఎన్‌టిఆర్‌ పూరీ సినిమా ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది. కొన్ని యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల అనుకుంటున్నాం అని ముగించారు.