శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: బుధవారం, 10 సెప్టెంబరు 2014 (19:17 IST)

'లింగా' చిత్రం స్వర్గంతో సమానం... కానీ రవితేజ పవర్... రాక్‌లైన్‌ వెంకటేష్‌

కన్నడలో పలు చిత్రాలు నిర్మించిన రాక్‌లైన్‌ వెంకటేష్‌... తెలుగులో తీయాలని రవితేజతో పవర్ మొదలుపెట్టారు. దర్శకుడు బాబీ కొత్తవాడు కావడంతోపాటు పలు కారణాలతో ఎక్కువకాలం పట్టింది.  కాగా, ఆ చిత్రం తర్వాత మొదలుపెట్టిన తర్వాత రజనీకాంత్‌తో చేస్తున్న 'లింగా' చిత్రం దాదాపు పూర్తిదశలో వుంది. ఇది తెలుగు, తమిళ చిత్రాలకు వున్న తేడానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఈ నెల 12న పవర్‌ విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...
 
'లింగా' ఎంతవరకు వచ్చింది? 
నిన్నటితో టాకీ పార్ట్‌ పూర్తయింది. క్లైమాక్స్‌ తీయాల్సి వుంది. ఈ నెల 20తో అది కూడా పూర్తిచేస్తాం. అక్టోబర్‌లో పాటలను విదేశాల్లో మూడు ప్రాంతాలను ఎంచుకున్నాం. అక్కడ చేశాక పోస్ట్‌ప్రొడక్షన్స్‌ చేస్తాం. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ పుట్టినరోజు నాడే సినిమా విడుదలవుతుంది.
 
'లింగా' కంటే ముందే 'పవర్‌' మొదలుపెట్టారు. ఆలస్యానికి కారణం? 
చాలా వున్నాయి. అయితే ఇంకా ఎక్కువ డెప్త్‌గా తీసుకురావాలని దర్శకుడు అనడంతో కొంత ఆలస్యమైంది.  
 
'పవర్‌'ను ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది? 
కన్నడలో 33 సినిమాలు చేసిన నేను తెలుగులో సినిమా చేయాలని చాలా ఏళ్ళుగా ప్రయత్నించాను. ఇక్కడ పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు స్నేహితులు. అందుకే మంచి కథ కుదిరితే పెద్ద దర్శకునితో చేయాలనే ఆశ వుంది. రవితేజతో గత కొన్నేళ్ళుగా టచ్‌లో వున్నాను. తనకూ విషయం చెబితే... మంచి స్క్రిప్ట్‌ రాగానే చెబుతానన్నారు. ఇలా నాలుగేళ్ళు గడిచాక ఓసారి కబురు పంపారు. రచయిత బాబిని పరిచయం చేశారు. కథ విన్న వింటనే ఒక్క సెకన్‌ కూడా ఆలోచించకుండా చాలా బాగుంది. తప్పకుండా చేస్తానని మొదలుపెట్టాను. 
 
షూటింగ్‌ అనుభవాలు ఎలావున్నాయి? 
షూటింగ్‌కు చాలా ఇబ్బందులు పడ్డాను. హైదరాబాద్‌లో షూటింగ్‌ చేయాలంటే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి చాలా ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. కన్నడలో చాలా సాఫీగా సాగుతుంది. 
 
సినిమా చూశాక ఎలా అనిపించింది? 
రవితేజ 'విక్రమార్కుడు' ఒక బ్రాండ్‌. ఆ తర్వాత చేస్తున్న పోలీసు పాత్ర. ప్రేక్షకుడిగా రవితేజ చిత్రాలన్నీ చూస్తాను. బెంగళూరులో ఓ మల్టీప్లెక్స్ వుంది. అక్కడ అన్ని హీరోల సినిమాలు ఆడతాయి. కానీ రవితేజ సినిమా వస్తుందంటే.. హీరోలందరి ఫ్యాన్స్‌ అక్కడే వుంటారు. ఆయనకు అందరి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ వుంది. ఓసారి వారిని అడిగితే.. ఆయన చిత్రాలంటేనే మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఆయన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ... ఇలా ఏదో ఒకటి ప్రత్యేకంగా నచ్చింది అని చెప్పారు.
 
ఇప్పుడు నిర్మాతగా ఎలా ఫీలవుతున్నారు? 
ఒక్కో స్టెప్‌ దాటుతూ వచ్చాను. సినిమా పూర్తిచేశాక ఆడియో రిలీజ్‌ చేస్తే ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది భయం వుండేది. పాటలు, టీజర్‌ బాగా వుందని రెస్పాన్స్‌ వచ్చాక ఒక మెట్టు ఎక్కేశామనిపించేది. ఇప్పుడు ఈ నెల 12 అనేది పెద్ద పరీక్ష. ఎంత ధైర్యంగా వున్నా విడుదల తేదీ అనగానే భయం తప్పకుండా వుంటుంది. నా గత చిత్రాన్నింటికీ ఉన్నట్లు భయం ఉంది.
 
'పవర్‌'ను కన్నడలో రీమేక్‌ చేస్తారా? 
చేస్తే కన్నడలోనే కాదు, తమిళం, హిందీలో కూడా చేయాలనుంది. రవితేజతో 'దబాంగ్‌' రీమేక్‌ చేయమని ఒకప్పుడు కొందరు సూచించారు. కానీ నేనే వద్దన్నాను. విక్రమార్కుడులోని మేనరిజాన్నే దబాంగ్‌లో పెట్టారని మళ్ళీ అదే చేస్తే బాగోదని అన్నాను.
 
బడ్జెట్‌ పరంగా కన్నడకు, తెలుగుకు ఎంత తేడా? 
ఖచ్చితంగా తేడా వుంది. ఎంత అంటే.. స్క్రిప్ట్‌ను బట్టే బడ్జెట్‌ వుంటుంది. ఏ భాష అయినా కథ ప్రకారమే వుంటుంది. కన్నడలో నేను లావిష్‌గా తీయాలని తీస్తే అక్కడ వసూళ్ళు రావు. ఎందుకంటే అది చిన్న పరిశ్రమ. కానీ తెలుగు అలాకాదు. ఇక్కడ చాలా స్పాన్‌ వుంది. ఒకరకంగా కామధేనువు లాంటిది తెలుగు పరిశ్రమ. ఎంత పిండుకుంటే అంత వస్తుంది.
 
సినిమాలో బాగా నచ్చిన అంశాలు? 
తల్లీకొడుకుల సెంటిమెంట్‌, రవితేజ పెర్‌ఫార్మెన్స్‌ కొత్తగా వుంటాయి. ఇందులో రవితేజ రెండు పాత్రలు పోషించారు. పోలీసు ఆఫీసర్‌గానూ, మరో పాత్రను పోషించారు. రెండు పాత్రలకు చాలా తేడా వుంది. దానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఆశ్చర్యమేసింది.
 
కన్నడ, తెలుగు ఇండస్ట్రీని ఎలా పోలుస్తారు? 
ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. పేదవాడి ఇంటి పెళ్లి కన్నడ పరిశ్రమ. అక్కడ అన్నింటికి సరైన విలువ వుంటుంది. తెలుగు పరిశ్రమ పెద్దింటి భోజనం. మొత్తం స్టడీ చేశాక ఇక్కడ చాలా వేస్టేజ్‌ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే... అన్నీ అడిగితే ఎలాసార్‌! అంటూ నాకే ఎదురు సమాధానం.  పైగా మీరు 1970 మనుషులనేవారు. నా ధాటికి తట్టుకోలేక ముగ్గురు కోడైరెక్టర్లను మార్చేశారు. వారికి క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టాలంటారు. మరి ఇన్నాళ్ళు ఇండస్ట్రీ వీరిని ఎలా భరిస్తోందో. 
 
దర్శకుడు బాబీకి ఇంకా క్లారిటీ కావాలి. స్క్రిప్ట్‌తోపాటు ప్లానింగ్‌ కూడా వుండాలని. ఒక సీన్‌ను ఎంత ఫుటేజ్‌ కావాలి, ఒక పాటకు, ఒక ఫైట్‌కు ఇలా ఫుటేజ్‌ అడిగితే అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గర సరైన క్లారిటీ లేదు. వేస్టేజ్‌ను కంట్రోల్‌ చేస్తే తెలుగులో వండర్స్‌ చేయవచ్చు.
 
రవితేజ, రజనీకాంత్‌ సినిమాలను ఎలా పోలుస్తారు? 
రజనీతో సినిమా స్వర్గానికి వెళ్ళినట్లుంటుంది. రవితేజ సినిమా గురించి ముందే చెప్పాను గదా.
 
మొదటివారం ఎంత షేర్‌ వస్తుందనుకుంటున్నారు? 
నా దృష్టిలో మొదటివారం వచ్చిన షేర్‌ అబద్ధం. ఏదో నిర్మాత కళ్ళు తుడవడానికి పనికివస్తుంది. అది నేను నమ్మను. కనీసం మూడు నాలుగు వారాలు సినిమా ఆడితే గానీ నిజమైన షేర్‌ అనేదానికి అర్థం వుంటుంది అని ముగించారు.