శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
Written By SELVI.M

పెద్దల అంగీకారంతోనే పెళ్ళి: తరుణ్

WD
తాను ఇంకా 3,4 ఏళ్లదాకా పెళ్ళి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు తరుణ్ తేల్చి చెబుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన తాజా చిత్రం "శశిరేఖా పరిణయం" విడుదలైంది. ఆ చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తిండిపోయేలా చేసిందంటున్న తరుణ్‌కు ఈ నెల 8వ తేదీ ( 8-01-09- గురువారం) పుట్టినరోజు. గురువారంనాటికి తరుణ్‌కు 25 ఏళ్ళు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన పలు విషయాలు ఇంటర్వ్యూ రూపంలో మీ కోసం...

ప్రశ్న... "శశిరేఖా పరిణయం" ఎలాంటి ఫీలింగ్‌ను ఇచ్చింది?
జ... అందులో అభిమన్యు పాత్రను చాలామంది ఇష్టపడ్డారు. ఆ పాత్రను చూసి చాలామంది అమ్మాయిలు.. ఇటువంటి అబ్బాయినే పెండ్లిచేసుకోవాలని, పెద్దలయితే ఇటువంటి అల్లుడే దొరకాలని అనుకున్నట్లు నాతో చెప్పారు.

ప్రశ్న... మరి మీ పెళ్లెప్పుడు..?
జ... ఇంకా 3, 4 ఏళ్ళ తర్వాతే. అదికూడా పెద్దల నిశ్చయించిన సంబంధమే.

ప్రశ్న... మీ డ్రీమ్‌రోల్ ఏమిటి?
జ... నాకు మాఫియా తరహా చిత్రాలంటే ఇష్టం. రాంగోపాల్‌వర్మ "సత్య"లో జె.డి. చేసిన పాత్ర, కంపెనీలో వివేక్‌ఓబ్‌రాయ్ పాత్ర నా డ్రీమ్ రోల్‌. "నువ్వేకావాలి" నుంచి లవర్‌బాయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్నా... ఏ రోల్ చేసినా ఇష్టంగానే చేస్తాను.

ప్రశ్న... "నువ్వేకావాలి" నుంచి "శశిరేఖాపరిణయం" వరకు విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
జ... చాలా ఎత్తుపల్లాలు చవిచూశాను. ప్రస్తుతం నా కెరీర్ బాగుంది. ఫ్లాప్‌లు మన చేతుల్లో లేవు. బాధపడితే ఏమీ చేయలేం. దాన్ని మెరుగుదిద్దుకునే దిశగా చర్యలు తీసుకుంటాను.

ప్రశ్న... మీకు నచ్చిన హీరోలు..?
జ... చిరంజీవి అంటే చాలా ఇష్టం. నాగార్జున, అల్లుఅర్జున్, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా ఇష్టమే. ఎక్కవగా నాతో సన్నిహితంగా ఉండేది శ్రీకాంత్.

ప్రశ్న... మీ ఓటు ఏ పార్టీకి..?
జ... అది రహస్యం. చెప్పకూడదు.

ప్రశ్న... దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
జ... ఇప్పుడప్పుడేలేదు. 3,4 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తా.

WD

ప్రశ్న... మీరు దర్శకత్వంలో శిక్షణ పొందారు కదా..?
జ... న్యూయార్క్ ఫిలిం అకాడమిలో సినిమాకు చెందిన అన్ని శాఖల్లోనూ శిక్షణ పొందాను. ఆ టైమ్‌లోనే మూడు షార్ట్ చిత్రాలు రూపొందించాను. అందులో ప్రేమ కథపై ఒకటి, మ్యూజిక్‌పై ఒకటి, మాఫియాపై మరొకటి రూపొందించాను.

ప్రశ్న... నటుడిగా గ్యాప్ రావడానికి కారణం?
జ... సఖియా, ఒక ఊరిలో వంటి నాలుగు చిత్రాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోవడంవల్ల విఫలమయ్యాను. దాంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నవవసంతం, భలేదొంగలు చిత్రాలు రావడం సంతోషాన్నిచ్చాయి.

ప్రశ్న... ఇప్పుడున్న పోటీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జ... పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది ఆరోగ్యకరమైన పరిణామం కూడా...

ప్రశ్న.... ఈ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు?
జ... నాకు డిసెంబర్ 29 నుంచి సంక్రాంతి వరకు హడావుడిగా ఉంటుంది. డిసెంబర్ 29న నా చెల్లెలు పుట్టినరోజు. ఆ తర్వాత కొత్త సంవత్సరం. ఆ తర్వాత 8వ తేదీ నా పుట్టినరోజు. ఆ తర్వాత సంక్రాంతి... ఇలా ఏదో వేడుక వస్తూనే ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి "శశిరేఖా పరిణయం" సక్సెస్ గుర్తిండిపోయేలా చేసింది.

ప్రశ్న... మీ కొత్త సినిమాల గురించి...?
జ... రాజు హిర్వాణీ నిర్మిస్తోన్న చిత్రం. షూటింగ్ అంతా యు.ఎస్.లోనే జరుగుతుంది. యు.ఎస్. వెళ్లి అక్కడ ప్రేమలో పడ్డ అమ్మాయి అబ్బాయి నేపథ్యంలో కథ సాగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది.