1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Meta Orders Work From Home First, Then Lays Off 8,000 Employees At 4 AM

ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే.. తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లండి : ఉద్యోగులకు మెటా ఈమెయిల్

meta
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ఉద్యోగులకు తేరుకోలేని షాకిచ్చింది. బుధవారం తెల్లవారుజామున అనేక మంది ఉద్యోగులను తొలగించింది. అనేక మంది ఉద్యోగుల మెయిల్ ఇన్‌బాక్స్‌లో ఓ మెయిల్ ప్రత్యక్షమైంది. ఈ మెయిల్ ఓపెన్ చేయగా, ఒక వేళ మీరు ఆఫీసులో ఉంటే దయచేసి మీ వ్యక్తిగత వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళండి అనే సందేశాన్ని పేర్కొంది. 
 
టెక్ దిగ్గజం మెటా సుమారు 8,000 మంది ఉద్యోగులను (మొత్తం ఉద్యోగులలో 10 శాతం) తొలగిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో 7,000 మందికి పైగా ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాజెక్టులకు బదిలీ చేసింది. కంపెనీని మరింత సమర్థవంతంగా నడపడానికి, ఏఐ వంటి రంగాలలో చేస్తున్న భారీ పెట్టుబడులను భర్తీ చేయడానికి ఈ తొలగింపులు అవసరమని మెటా తన ప్రకటనలో పేర్కొంది.
 
ఈమెయిల్ అందుకున్న ఉద్యోగుల యాక్సెస్ బ్యాడ్జీలను తక్షణమే డియాక్టివేట్ చేశారు. కంపెనీ అంతర్గత సిస్టమ్స్‌కు  వారి యాక్సెస్‌ను కూడా నిలిపివేశారు. గంటలోపే వారిని మెటా "అలుమ్నై పోర్టల్"కు అనుసంధానించారు. అక్కడ సెవరెన్స్ ప్యాకేజీ, వీసా, ఆరోగ్య బీమా, ఉద్యోగ సహాయం వంటి వివరాలు పొందుపరిచారు. "మెటా ప్రయాణంలో మీ పాత్ర ఎంతో ముఖ్యమైనది" అని ఈమెయిల్లో పేర్కొనడం గమనార్హం.
 
ఈ పరిణామాలపై ఉద్యోగులకు పంపిన మరో మెమోలో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. "కంపెనీ నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి వీడ్కోలు పలకడం ఎప్పుడూ బాధాకరమే. ఈ నిర్ణయం నాకెంతో భారంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మరోసారి కంపెనీ వ్యాప్తంగా ఉద్యోగాల కోతలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తును నిర్దేశించగల అతికొద్ది కంపెనీలలో మెటా ఒకటని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల కోసం 'పర్సనల్ సూపర్అంటెలిజెన్స్' నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
 
మరోవైపు, ఉద్యోగం కోల్పోయిన వారికి మెటా భారీ సెవరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. దీని కింద 16 వారాల బేసిక్ జీతంతో పాటు కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల జీతాన్ని చెల్లిస్తారు. అలాగే, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కంపెనీయే భరిస్తుంది. వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు, ముఖ్యంగా హె-1బీ వీసాదారులకు, ఇమ్మిగ్రేషన్ మార్గదర్శకత్వం కోసం న్యాయ సంస్థల వివరాలను 'అలుమ్నై పోర్టల్'లో అందుబాటులో ఉంచినట్లు మెటా తెలిపింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కాక్రోచ్ జనతా పార్టీకి విశేష స్పందన... ఇన్‌స్టాలో 66 లక్షల పైగా ఫాలోవర్లు