సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (13:44 IST)

మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపి టిక్‌టాక్‌ను సొంతం చేసుకోనున్న వాల్‌మార్ట్

అమెరికాలో కార్యకలాపాల కోసం మైక్రోసాఫ్ట్‌తో జతకట్టి టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలని వాల్‌మార్ట్ రంగం సిద్ధం చేస్తోంది. చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నట్లు ఇటీవల ట్రంప్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 90 రోజుల్లోగా టిక్‌టాక్ తమ దేశంలో ఆపరేషన్స్ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. టిక్‌టాక్ వల్ల తమ దేశ ప్రజల డేటాను చైనా దుర్వినియోగం చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తొలుత ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే వీడియో షేరింగ్ యాప్‌ను చేజిక్కించుకునేందుకు ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా రంగంలోకి దిగింది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఆ యాప్‌ను కొంటామని వాల్‌మార్ట్ చెప్పింది. 
 
అమెరికాలో టిక్‌టాక్ యాప్ అధిపతి రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. అమెరికా ప్రభుత్వ ఆంక్షలకు తగినట్లుగా.. టిక్‌టాక్ యూజర్ల అంచనాలకు సరిపడే విధంగా.. మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పనున్నట్లు వాల్ మార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.