మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (16:50 IST)

పెన్నూ.. పేపరు ఉందిగా... రాసుకోండి... బీజేపీకి 300 సీట్లు : అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోపం వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లకు మించవు అంటూ వస్తున్న కథనాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల వద్ద మాట్లాడుతూ.. మీ చేతుల్లో పెన్నూ పేపరు ఉందిగా.. ఇపుడు చెబుతున్నా రాసుకోండి.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 300 సీట్లకు తగ్గవు అంటూ ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆరో విడత్ పోలింగ్ పూర్తయ్యేనాటికి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (272) దాటేసిందని, చివరి విడత పోలింగ్ తో తమ పార్టీకి 300 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 'ఎన్ని సీట్లు వస్తాయని మీరు (మీడియా) పదేపదే అడుగుతున్నారు. నేను దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల నాడి ఎలా ఉందో చూశాను. ఐదు, ఆరు విడతల పోలింగ్ నాటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ దాటేసింది. ఇప్పుడు ఏడో దశ పోలింగ్ తర్వాత బీజేపీ మెజారిటీ 300 సీట్లు దాటుతుంది. తద్వారా మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుంది' అని స్పష్టం చేశారు.
 
మరోవైపు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయనీ అందువల్ల అక్కడి సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో తృణమూల్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో బీజేపీ, మమత సర్కారుపై విరుచుకుపడుతోంది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ చీఫ్‌ అమిత్‌షా రోడ్డు షో సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా 19వ శతాబ్దపు సామాజిక కార్యకర్త విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాడులు హింసాత్మకంగా మారడంతో పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకుని అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ ఈ రోజు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మమత సర్కార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేసింది.