సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (10:43 IST)

సార్వత్రిక ఎన్నికలు : నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాలుగో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నాలుగో దశ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. 
 
తొమ్మిది రాష్ట్రాల్లోని మొత్తం 72 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుంది. ఈ దశల్లో 943 మంది అభ్యర్థులు సోమవారం జరిగే ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 13, ఉత్తర్‌ప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, మధ్యప్రదేశ్ 6, ఒడిశా 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి నాలుగో విడుతలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 
 
మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడ, సీధీ, జబల్‌పూర్, మహారాష్ట్రలోని ఉత్తర ముంబై, దక్షిణ ముంబై, ఉత్తర మధ్య ముంబై, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్, కన్నౌజ్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, రాజస్థాన్‌లోని జలావర్ బరన్, జోధ్‌పూర్, బాడ్‌మేర్ ఈ విడుతలో కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు ఈ విడుతలోనే తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. మహారాష్ట్రలో నాలుగో విడుతతో ఎన్నికలు పరిసమాప్తం కానున్నాయి.
 
ఈ దశలో పలువురు రాజకీయ నేతలు బరిలో ఉన్నారు. ఛింద్‌వాడ నుంచి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్, సీధీ నుంచి కాంగ్రెస్ నేత అజయ్ సింగ్, జబల్‌పూర్ నుంచి బీజేపీ నేత రాకేశ్‌సింగ్ బరిలో ఉన్నారు. బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్, బీజేపీ నేత పూనమ్ మహాజన్, కాంగ్రెస్ నేత సునీల్‌దత్ కూతురు ప్రియాదత్ మహారాష్ట్ర నుంచి పోటీలో ఉన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ నుంచి పోటీ చేస్తుండగా.. పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి బీజేపీ నేత బాబుల్ సుప్రియో పోటీలో ఉన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌పై జోధ్‌పూర్‌లో పోటీకి దిగారు.