శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By

ఆ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్కసీటు కాదు : మమత జోస్యం

భారతీయ జనతా పార్టీపై వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుగ్లీ జిల్లాలోని పండువాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాషాయదళానికి కనీసం 80 స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఓట్లు చీలిపోతాయన్నారు. 
 
అంతేకాకుండా 440 వోల్టుల విద్యుత్ ఎంత ప్రమాదకరమో, బీజేపీ కూడా అంతే ప్రమాదకరమన్నారు. బీజేపీ దేశానికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి దూరంగా ఉండాలని, పొరబాటున కూడా ఆ పార్టీకి మద్దతుగా ఓటేయవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం దేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ మేరకు తాను హామీ ఇస్తానని అన్నారు. 'బీజేపీ, మోడీ రెండోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఆ పార్టీ నిండా నిరక్షరాస్యులే. వాళ్ల నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి!' అంటూ విమర్శలు గుప్పించారు.