ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (15:28 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎంతమంది చనిపోయారంటే...

car accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 12 మంది చనిపోయారు. ఛత్రపరి శంబాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న ట్రక్కును బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 23 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి, ఆరుగురు మహిళలు ఉన్నారు.
 
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైకి 350 కి.మీ దూరంలో వైజాపుర్‌ ప్రాంతంలో అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి అతి వేగం కారణమని పోలీసులు భావిస్తున్నారు. మినీ బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
 
గతేడాది డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. దీనిపై ఇప్పటివరకు సుమారు 900పైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
 
'సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుగా అనిపించి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా సరే.. ఈ  ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉంది' అంటూ వ్యాఖ్యానించారు.