షీలా పొలిటికల్ హిస్టరీని క్లోజ్ చేసిన కేజ్రీవాల్.. నేడు కేజ్రీవాల్‌కు చెక్ పెట్టిన షీలా తనయుడు!!
తాజాగా వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆదివారం వెల్లడైన ఈ ఎన్నికల ఫలితాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా చిత్తుగా ఓడిపోయారు. ఈ ఓటమికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ముఖ్య కారణం కావడం గమనార్హం.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థులుగా పర్వేష్ వర్మ (బీజేపీ), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్)లు బరిలో నిలిచారు. ఈ స్థానం ఫలితాల్లో కేజ్రీవాల్ 4,089 ఓట్ల తేడాతో ఓడిపోగా, బీజేపీ అభ్యర్థికి 30,088 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 4568 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ అభ్యర్థి విజయానికి కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఓట్లను చీల్చడమే. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసివుంటే ఫలితాలు మరోలా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఆప్ ఆవిర్భవించిన 2013 ఎన్నికల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ ఓడించారు. ఈ ఓటమితో ఆమె రాజకీయ భవిష్యత్ ముగిసిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షీలా తనయుడు షీలా దీక్షిత్‌ను బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓట్లను చీల్చడం ద్వారా కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాడు. అలా తన తల్లి ఓటమికి తనయుడు ఇపుడు ప్రతీకారం తీర్చుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతుంది.