1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (16:50 IST)

అన్నాడీఎంకేలో దినకరన్ తిరుగుబాటు : 'పళని' సర్కారుకు 19 మంది ఎమ్మెల్యేల గుడ్‌బై

తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకేలో మరో తిరుగుబాటు మొదలైంది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో

తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకేలో మరో తిరుగుబాటు మొదలైంది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 
 
తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కట్టబెట్టారు. ఇది టీటీవీ దినకరన్ వర్గానికి ఏమాత్రం మింగుడుపడలేదు. దీంతో వీరంతా మంగళవారం రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత వీరంతా బహిరంగంగానే ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రటించారు. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావుకు కూడా తెలిపినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్టయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనదాని కన్నా ముగ్గురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు.
 
పైగా, అన్నా డీఎంకే నేత దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలను పుదుచ్చేరి పంపించినట్లు సమాచారం. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌తో మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ ముగ్గురూ పన్నీర్‌కు హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.