1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:39 IST)

జయ, శశికళ అక్రమాస్తుల ఫైళ్లను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుని తిరుగుబాటు నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం గూటికి

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుని తిరుగుబాటు నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం గూటికి చేరుకుంటున్నారు. మరికొందరు ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఇంకొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. 
 
ఇదిలావుండగా, రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం చెన్నైకు చేరుకున్నారు. ఆయనకు సీఎం పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. ఆ తర్వాత పన్నీర్‌కు సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వగా, రాత్రి 7.30 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో, తనకన్నా ముందగానే గవర్నర్‌తో భేటీ అయి కొంతమేర లబ్ధి పొందాలని భావించిన శశికళ ఆశలకు గండిపడింది. 
 
మరోవైపు.. జయలలిత అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసులో జయలలితతో పాటు.. శశికళ, దినకర్‌లతో మరికొందరు నిందితులు. ఈ కేసులో జయతో పాటే గతంలో ఆమె జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ నేపథ్యంలో జయ, శశికళల అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ పరిశీలించారన్న వార్త శశికళ శిబిరంలో కలకలం రేపుతోంది. కేసు నేపథ్యంలో, శశికి వ్యతిరేకంగా రాజ్‌భవన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో అనే భయం శశి వర్గీయుల్లో నెలకొంది. మొత్తంమీద ఇటు పన్నీర్ ఎత్తులు, గవర్నర్ అనుసరిస్తున్న వైఖరితో శశికళ శిబిరానికి ముచ్చెమటలు పోస్తున్నాయి.