గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
గుజరాత్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్టుచేసింది. ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్‌తో సంబంధాలున్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నకిలీ నోట్ల రాకెట్ నడుపుతూ ఆల్‌ఖైదా భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న మొహద్ ఫైక్, మొహద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి, జీషన్ అలీ అనే నలుగురుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరిని గుజరాత్ రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో అరెస్టు చేసినట్టు సమాచారం.
ఈ ఉగ్రవాదులు తమ కమ్యూనికేషన్ రహస్యంగా ఉంచేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ యాప్‌లు వారి సందేశాలను ఎటువంటి ఆధారాలు లేకుండా తొలగించేలా రూపొందించారు. సోషల్ మీడియాలో వేదికల ద్వారా ఆల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను జిహాదీ కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.
క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...
మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో దారుణం జరిగింది. అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తిని వరుసక్రమం(క్యూ)లో రమ్మని చెప్పినందుకు ఓ మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని, జుట్టుపట్టిలాగి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
కళ్యాణ్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి నందివాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆమె విధుల్లో ఉండగా ఆస్పత్రికి కొంతమంది రోగులు వచ్చారు. అయితే, అప్పటికి డాక్టర్ రాకపోవడంతో వారిని వేచి వుండమని చెప్పింది. ఆలస్యంగా వచ్చిన ఆ డాక్టర్ ముందుగా మెడికల్ రిప్రజెంటేటివ్‌ను కలిసి మాట్లాడారు.
అప్పటికే ఆయన కోసం వేచివున్న రోగులు దీనిపై రిసెప్షనిస్ట్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కుమారుడు చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చాడు. అపాయింట్మెంట్ లేకుండానే డాక్టర్ క్యాబిన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అపుడు ఆ రిసెప్షనిస్ట్ అతడిని అడ్డుకుని క్యూలో రావాలని కోరింది.
దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. కాలితో తన్ని, జట్టుపట్టి లాగి తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న కొంతమంది అతడిని బలవంతంగా పట్టుకుని బయటకు పంపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గోకుల్ ఝాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.