పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు
శత్రుదేశం పాకిస్థాన్‌కు గూఢచర్య చేస్తున్నాడనే ఆరోపణలపై ఓ సైనికుడుని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా పరిధిలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవీందర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడు జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో జవానుగా పని చేస్తున్నట్టు వెల్లడించారు.
గూఢచర్యం ఆరోపణల కేసులో ఇటీవల మాజీ సైనికుడు గుర్‌ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. అతడిని విచారించగా ఈ దేవీందర్ పేరు బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు పూణెలోని ఆర్మీ క్యాంప్‌లో మొదటిసారి కలిశారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్, సిక్కింలలో కలిసి పని చేసినట్టు వివరించారు.
సర్వీస్ సమయంలో భారత ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని గురుప్రీతి సింగ్ లీక్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సమాచారం తాలూకు పత్రాలు సేకరణకు దేవీందర్ సహకరించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. దాంతో దేవీందర్‌ను అదుపులోకి తీసుకుని మొహాలీ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుంత గూఢచర్యంలో నిందితుడు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.